బూరాడ వద్ద ఘోర ప్రమాదం

Dec 25,2023 21:33

 ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని బూరాడ గ్రామ సమీపంలో సోమవారం ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢకొీన్న ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక మహిళ చేయి తెగి రోడ్డుపై పడటంతో చూపురులు సైతం ఆందోళనకు గురయ్యారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే..పాలకొండ నుంచి రాజాం వెళ్తున్న ఆటో, రాజాం నుంచి అంబాడ వెంకటాపురం వైపు ఎదురుగా వస్తున్న మరో ఆటో బూరాడ వద్ద ఢకొీన్నాయి. ఈ సంఘటనలో అంబాడ వెంకటాపురం గ్రామానికి చెందిన వావిలపల్లి కళ్యాణికి కుడి చేయి తెగిపడింది. కుడికాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అదే గ్రామానికి చెందిన పనస దుర్గమ్మ తలకు తీవ్ర గాయమైంది. తాతపూడి సూరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. చాటాయివలస గ్రామానికి చెందిన గోదారి రాములకు రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. లక్ష్యంపురం గ్రామానికి చెందిన కెంబూరి బంగారమ్మకు కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కొంతమందిని రాజాం కేర్‌ ఆసుపత్రికి, ఇంకొంతమందిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కళ్యాణి, దుర్గమ్మ, రాములు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఏరియా ఆసుపత్రి వైద్యులు సమాచారం మేరకు రేగిడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.

➡️