బొగ్గుల దిబ్బలో దళితుల ఇళ్లు తొలగింపు

Feb 6,2024 20:55

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: నగరంలోని 40వ డివిజన్‌ బొగ్గులదిబ్బ ఎస్‌సి కాలనీలో 50ఏళ్లుగా నివాసముంటున్న దళితుల ఇళ్లను మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు మంగళవారం తొలగించారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న ఈ ఇళ్లను తొలగిస్తామని గతంలో అధికారులు చెప్పడంతో 18 కుటుంబాల వారు ముందుగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వారి వాదనలను విని ఈనెల 7వ తేదీ వరకు గడువు విధించింది. అయినప్పటికీ కార్పొరేషన్‌ సిబ్బంది మంగళవారం తెల్లవారి ఇళ్లను జెసిబితో తొలగించారు. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు, బి.రమణ, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.అదితి గజపతి అక్కడికి చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసుల సాయంతో సిబ్బంది ఆ ఇళ్లను తొలగించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ దళితుల ఇళ్లు తొలగింపు అన్యాయమని. ఎటువంటి నోటీస్‌ ఇవ్వకుండా, రాత్రి 12 గంటలకు వాలంటీర్‌ వెళ్లి తలుపు కొట్టి తెల్లారేసరికి ఇళ్లు తొలగిస్తామని చెప్పడం, ప్రజల లేచేటప్పటికే పోలీసులు, మున్సిపల్‌ అధికారులు వచ్చి దళితుల ఇళ్లు కూల్చేసి నిలువ నీడ లేకుండా చేయడం అన్యాయమని అన్నారు. వెంటనే పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్‌ చేశారు. టిడిపి నాయకులు అదితి గజపతి మాట్లాడుతూ చట్టానికి కూడా కనీసం గౌరవం ఇవ్వకుండా చేస్తున్నారని, కనీసం బాధితులు వారి సామాన్లను ఇంట్లో నుండి తీసుకొనే అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. వెంటనే వీరికీ ప్రత్యామ్నాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు . దళితులకు న్యాయం జరిగే వరకూ అన్ని విధాలా సిపిఎం,టిడిపి పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️