బొత్సపై భయమెందుకో?

Mar 26,2024 21:34
బొత్సపై భయమెందుకో?

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి  : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, వైసిపి సీనియర్‌ నేతపై పోటీకి టిడిపి భయపడుతుందా? అందుకే చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది తేల్చుకోలేకపోతోందా? అంటే చాలా మంది నోట ఔననే సమాధానం వినిపిస్తోంది. కొంతమంది మాత్రం జిల్లాలో బొత్స ప్రభావాన్ని, హవాను కట్టడి చేసేందుకు టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. కానీ, టిడిపి వ్యూహం వైసిపి దాహం తీర్చే విధంగా మారిపోతోంది. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున దాదాపు పదేళ్లగా స్థానిక టిడిపి కేడర్‌తో మమేకమై పనిచేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో టిడిపిలో మరెవ్వరూ లేనంతగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. లోకేష్‌ నిర్వహించిన యువగళం సభకు కూడా నాగార్జున నాయకత్వంలో జనం భారీగానే తరలి వచ్చారు. ఈనేపథ్యంలో చీపురుపల్లి సీటు నాగార్జునకే అన్న చర్చసర్వత్రా సాగింది. అనూహ్యంగా నాగార్జునతోపాటు ఆయన పెదనాన్న, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అభ్యర్థిత్వంపై ఐవిఆర్‌ఎస్‌ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో, నాగార్జున, ఆయన అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరును పరిశీలనలో ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఇంతమంది పేర్లు పరిశీలనలో వున్నప్పటికీ ఎటూ తేల్చలేకపోతోంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడి, పోలింగ్‌ తేదీ ఖరారు కావడం, మరోవైపు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోకజవర్గాల్లోనూ ప్రచారం హోరెత్తు తుండడం, చివరికి చీపురుపల్లిలోనూ వైసిపి తరపు ప్రచారం ఊపందుకోవడంతో ఈ నియోజకవర్గంలో నా అనుకునే నాయకుడు లేక తెలుగు తమ్ముళ్లు నైర్యాశ్యంలోకి వెళ్లారు. ఇప్పటికీ నాగార్జున నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ అభ్యర్థిత్వం ఖారారు కాక అభిమానులు అయోమయంలో ఉన్నారు. కేడర్‌లో పట్టుదల సడలుతోందని మండల, నియోజకవర్గ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా కొద్ది రోజులుగా బొత్స తన ప్రచార పర్వానికి పదును పెట్టారు. నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఒక దఫా ప్రచారాన్ని పూర్తిచేశారు. వాస్తవానికి చీపురుపల్లి రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారి పరిశీలిస్తే నేటి వైసిపి, నాటి కాంగ్రెస్‌ కన్నా టిడిపి అభ్యర్థులే ఎక్కువసార్లు గెలుపొందారు. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కిమిడి నాగార్జునపై వైసిపి తరపున పోటీ చేసిన బొత్స సత్యనారాయణ విజయం సాధించినప్పటికీ, అంతకు ముందు 2014లో నాగార్జున తల్లి మృణాళినిపై పోటీచేసి ఓటమి చెందారు. ఈ మాటకొస్తే మృణాళిని ఈ నియోజకవర్గంలో కూడా లేరు. అంతకు ముందు 2004, 2009 ఎన్నికల్లో వరుసాగా రెండుసార్లు టిడిపి అభ్యర్థి గద్దె బాబూరావుపై బొత్స విజయం సాధించినప్పటికీ, 1983లో టిడిపి ఆవిర్భావం నుంచి వరుసగా ఐదు సార్లు టిడిపియే విజయం సాధించింది. ఈ విధంగా పరిశీలించినప్పుడు టిడిపి ఆవిర్భావం తరువాత జరిగిన 9 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకసారి వైసిపి, రెండు సార్లు కాంగ్రెస్‌ గెలిచాయి. మిగిలిన ఆరుఎన్నికల్లో టిడిపి హవా కొనసాగింది. పోనీ, ఇక్కడ బొత్సకి ఓటమి లేదా అంటే ఒకసారి నాగార్జున తల్లే ఓడించారు. ఇలా టిడిపికి కంచుకోటలా ఉన్న చీపురుపల్లిలో నేడు అభ్యర్థిని ఖరారు చేసేందుకు సాహశించ లేకపోవడంతో నియోకవర్గంలోని టిడిపి అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోందని సాక్షాత్తు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇంకా వ్యూహం పేరుతో అభ్యర్థి ప్రకటన తేల్చకపోతే పనిగట్టుకుని వైసిపికి అప్పగించినట్టేనంటూ పలువురు విశ్లేసిస్తున్నారు.

➡️