బ్యాంకు లావాదేవీలపై నిఘా

Mar 21,2024 21:50

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు :
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల ఖాతాల వివరాలు ఎప్పటికప్పడు అందించాలని బ్యాంకర్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో నాల్గవ విడతలో ఎన్నికలు జరగనున్నాయని, ఏప్రిల్‌ 18వ తేదీని నోటిఫికేషన్‌ జారీ అవుతుందని, మే 13న ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసిన మార్చి 16వ తేది నుంచి ఎన్నికల ప్రవర్తన నియమవళి అమల్లోకి వచ్చిందని వివరించారు. పోటీ చేసే ప్రతి లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, శాసన సభ అభ్యర్థి రూ.40 లక్షల మేర ఖర్చు చేసేందుకు అనుమతి ఉంటుందని, అంతకు మించి జరిగే వ్యయంపై పటిష్టమైన నిఘా ఉంటుందని అన్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుండి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటి కప్పుడు ఐటి శాఖతో పాటు, జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాలన్నారు. అసాధరణంగా, అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్ష నగదుకు మించి ఉపసంహరణలు, డిపాజిట్ల లావాదేవీలు జరిగితే వివరాలను అందించాలన్నారు. ఒకే బ్యాంకు ఖాతా నుంచి ఒక నియోజకవర్గం లేదా జిల్లాలోని వేర్వేరు బ్యాంకు ఖాతాలకు ఆర్టీజీఎస్‌ ద్వారా నగదు జమవుతుంటే వివరాలు అందించాలన్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు, వారి సంబంధీకులు గానీ, రాజకీయ పార్టీల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.లక్షకు మించి జరిపే లావాదేవీల వివరాలను కూడా అందించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో అధిక మొత్తంలో నగదు, లిక్కరు, ఓటర్లను ప్రలోభపరిచే సామగ్రి అక్రమ తరలింపును అరికట్టేందుకు ఐటి, జిఎస్‌టి, పోలీస్‌, ఎక్సైజ్‌ తదితర ఎన్ఫోర్సుమెంట్‌ ఏజన్సీలు నిరంతరం నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. బ్యాంకులు తరలించే నగదు వివరాలను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇఎస్‌ఎంఎస్‌ యాప్‌లో నమోదు చేసుకొని క్యూర్‌ కోడ్‌తో రసీదు తీసుకోవాలని సూచించారు. బ్యాంకు నగదును తీసుకువెళుతున్న ఉద్యోగులు, సిబ్బంది గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని, నగదుకు సంబంధించిన పత్రాలు, అనుమతులు రసీదులు కలిగి ఉండాలని చెప్పారు. ఎన్నికల అధికారిగానీ, ఇతర తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు బ్యాంకుల నుంచి నగదు సేకరించినట్లు సంబంధిత పత్రాలు, రసీదులు చూపించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ పి.రోజా, ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ లలితా, లీడ్‌ బ్యాంక్‌ మేనేజరు మహిపాల్‌రెడ్డి, యూనియన్‌ బ్యాంక్‌ రీజినల్‌ హెడ్‌ ఎస్‌.జవహర్‌ పాల్గొన్నారు.

➡️