ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను జిల్లా కలెక్టర్‌ వి. విజరురామరాజు ఆధ్వర్యంలో శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించామని డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్‌ లోని సమావేశ మందిరంలో ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని నియోజక వర్గాల అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు, జిల్లా వ్యయ మానిటరింగ్‌ సిబ్బందికి ఎన్నికల ఖర్చుల వివరాల (అకౌంట్‌ రికన్సిలియేషన్‌) పై ఒకరోజు శిక్షణ డిఆర్‌ఒ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024లో జిల్లాలో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు, పార్లమెంట్‌ అభ్యర్థులు తమకు సంబంధించిన ఎన్నికల జమా ఖర్చుల వివరాలను జిల్లా వ్యయ మానిటింగ్‌ కమిటీకి సబ్మిట్‌ చేయాలని తెలిపారు. జిల్లాకు ఈనెల 29 నుంచి జూలై 6 వరకు రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు రానున్న నేపథ్యంలో 77 ఆర్‌పిఎ యాక్ట్‌1971 ఎన్నికల నియమావళి ప్రకారం పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తమ జమ, ఖర్చులు వివరాలు, బిల్స్‌, వోచర్లు, బ్యాంక్‌ పుస్తకాలు సరైన క్రమంలో జులై 3 లోపల అందజేయాలని తెలిపారు. ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు రిజిస్టర్లు – ఎబిసి, అబ్స్ట్రాక్ట్‌ స్టేట్మెంట్స్‌ పార్ట్స్‌ -1,2,3,4, ఎక్సపెండెచర్‌ వివరాలు -షెడ్యూల్‌ 1 నుంచి 11 ఖచ్చితంగా సరిచూసుకొని అన్నింటి పైన పోటీ చేసిన అభ్యర్థి సైన్డ్‌ కాపీతో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల జమా ఖర్చుల వివరాలైన బిల్స్‌, వోచర్స్‌, ఎక్సప్లేనేటరీ నోటు అన్ని ఒరిజినల్‌ ఫార్మాట్‌లో సమ్మిట్‌ చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులే కాకుండా పోటీ చేసినా ప్రతి అభ్యర్థి ఎన్నికల అకౌంట్‌ ఖర్చులను చూపాలన్నారు. రూల్‌ 86 ప్రకారం దేని కోసం ఖర్చు చేశారు, తేదీతో సహా తెలియజేయాలని అన్నారు. నామినేషన్‌ తేదీ నుంచి ఎన్నికల ఫలితాల తేదీ వరకు అభ్యర్థులు బిల్లులు చెల్లించినవి,ఇంకా చెల్లించాల్సినవి కూడా ఖర్చుల వివరాల్లో పొందుపరచాలన్నారు. సార్వత్రిక ఎన్నికల నియమావళి రూల్‌ 90 ప్రకారం మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అభ్యర్థికి సంబంధించి ఎన్నికల ఖర్చులు రూ .40 లక్షల లోపు, పార్లమెంట్‌ అభ్యర్థికి సంబంధించి రూ.95లక్షల లిమిట్‌ ఉంటుందన్నారు. అభ్యర్థులకు వచ్చిన సోర్స్‌ ఆఫ్‌ ఫండ్‌ పైన ఎన్నికల జమా ఖర్చుల్లో తెలపాల్సిఉ ంటుందన్నారు. ఈనెల 27వ ఉదయం 10.30 నుంచి 5 వరకు అకౌంట్స్‌ రిసెప్షన్‌ టీం సిబ్బంది కలెక్టరేట్‌ వీడియో కాన్వరెన్స్‌ హాలులో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎన్నికల జమా ఖర్చులపై కచ్చితంగా వివరాలు తెలపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యయ నోడల్‌ ఆఫీసర్‌ జి.నాగరాజ రావు, డిసిఒ సుభాషిణి, జిల్లా అడిట్‌ ఆఫీసర్‌ మంజుల వాణి, డిస్టిక్‌ కో-ఆపరేటివ్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ సురేష్‌ కుమార్‌, ఎన్నికల ఏజెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️