బ్యాడ్మింటన్‌ ఆశా కిరణాలు ఆషాశ్రీ, కావ్య శ్రీరాం

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన చిన్నారి దండు ఆషాశ్రీ భారత బ్యాడ్మింటన్‌లో ఆశాకిరణంగా వెలుగొందాలని టీటీడీ సభ్యులు, లార్డ్‌ కృష్ణ బాడ్మింటన్‌ అకాడమీ ఛైర్మన్‌ శిద్దా సుధీర్‌ కుమార్‌ ఆకాంక్షించారు. ఒంగోలు లార్డ్‌ కృష్ణ అకాడమీలో శిక్షణ పొందిన పదేళ్ల చిన్నారి దండు ఆషాశ్రీ, విజయవాడలో శిక్షణ పొందిన కావ్య శ్రీరాం నవంబర్‌ 15 నుంచి 18 వరకు జాతీయ బాలికల డబుల్స్‌లో బంగారు పతకం సాధించారు. అలాగే ఆషాశ్రీ బాలికల సింగిల్స్‌లో రజత పతకాన్ని సాధించింది. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన ఆషాశ్రీ, కావ్య శ్రీరాంలను ఒంగోలులోని లార్డ్‌ కృష్ణ బ్యాడ్మింటన్‌ అకాడమీ కార్యాలయంలో శనివారం సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శిద్దా సుధీర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పిన్న వయసులోనే జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడమే కాకుండా అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించడం అభినందనీయమని అన్నారు. జన్మనిచ్చిన తలిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, పుట్టిన ఊరికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న చిన్నారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానని చెప్పారు. క్రీడలతో పాటుగా చదువులో కూడా ఇదే పట్టుదల ప్రదర్శించాలని సూచించారు. జిల్లాలోని బ్యాడ్మింటన్‌ క్రీడాకారులకు తమ అకాడమీ అండగా ఉంటుందని చెప్పారు. తాము స్థాపించిన లార్డ్‌ కృష్ణ బాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందిన ఆషాశ్రీ కలకత్తాలో జరిగిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి మురళీకృష్ణ అన్నారు. తమ సంస్థలో 50 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. బాడ్మింటన్‌ క్రీడల్లో జాతీయ స్థాయి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కెనరా బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ బీఎన్‌ శశిధర్‌, ప్రముఖ న్యూరోసర్జన్‌ కేవి చంద్రశేఖర్‌ ఆషాశ్రీని అభినందించారు. అనంతరం గోల్డ్‌ మెడల్‌ విజేత ఆషాశ్రీ, కావ్య శ్రీరాంలతో పాటుగా బాలుర డబుల్స్‌ విభాగంలో కే సుహాస్‌, కోచ్‌ అమన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ సెక్రటరీ ఏ పద్మప్రియ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఏ శశిధర్‌, ఎం రఘుబాబు, డి శ్రీనివాస్‌, ఏ కృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️