భయం..భయంగా..తీరం…

Dec 3,2023 23:17
కేంద్రాల ద్వారా

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్రవాయుగుండంగా మారడంతో జిల్లా ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. ప్రధానంగా తీరప్రాంత వాసుల్లో ఆందోళన ఎక్కువవుతుంది. తుఫాను ముంచుకొస్తూ రెండు రోజులపాటు పెద్ద ఎత్తున గాలులు వీయడంతో పాటు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఇప్పటికే వేటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. వేటకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. రెండు రోజులుగా వేటలేక ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో భారీ గాలులు వీస్తాయనే హెచ్చరికలతో పూరిపాకల్లో నివాసముంటున్న మత్స్యకారుల్లో ఆందోళన ఎక్కువైంది. తుపాన్‌ కారణంగా ఉప్పాడ కాకినాడ బీచ్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సూరడ పేటలో ఆదివారం కాకినాడ ఆర్‌డిఒ ఇట్ల కిషోర్‌, తహశీల్దార్‌ ప్రసాద్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మత్య్సకారులకు సూచించారు. అవసరమైతే పునరావాస కేంద్రానికి తరలి రావాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ఎవరూ ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా నిత్యవసర సరుకులను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల న్నారు. నెల్లూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చ రికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సిఎం జగన్‌ అధికారులను ఆదేశించడంతో జిల్లా అధికారులు ఆ మేరకు సహాయక చర్యల్లో మునిగిపోయారు. విద్యుత్‌, రవాణాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని క్రింది స్థాయి అధికారులకు కలెక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. శిబిరాల్లో బాధితుల కోసం తాగునీరు, ఆహారం, పాలు అందుబాటులో ఉంచాలన్నారు. తుపాను దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా కాకినాడ జిల్లాలకు రూ.కోటి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.అప్రమత్తంగా ఉండాలితుపాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విభాగాల అధికారులూ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌ నాగ నరసింహారావు ఆదేశిం చారు. తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో తీసుకున్న ముందస్తు చర్యలను క్షేత్ర స్థాయిలో ఆయన ఆదివారం ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పృథ్వీ చరణ్‌ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్‌ఎఫ్‌సిఎల్‌, రైల్వేడ్రైన్‌ ప్రాంతాలలో అవుట్‌ లెట్‌ లను క్లీనింగ్‌ చేసే ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడకుండా కల్వర్టులు, అవుట్లెట్లను శుభ్రం చేసేందుకు ఏడు జెసిబిలు, టిఎస్‌-20 మిషన్లు పని చేస్తున్నాయన్నారు. వర్షపు నీరు స్తంభించిపోతే తొలగించేందుకు మోటార్ల సిద్ధం చేసుకోవాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగితే మంచినీటికి ఇబ్బంది లేకుండా పంపు హౌస్‌ల వద్ద జనరేటర్లు సిద్ధం చేసుకోవాలని కోరారు. పూరిళ్లు, శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడిపోతే తక్షణమే తొలగించేలా సిద్ధంగా ఉండాలని విద్యుత్‌, ఉద్యాన విభాగాల అధికారులను కోరారు. వర్షాలు నేపథ్యంలో పారిశుధ్యం క్షీణించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య విభాగానికి సూచించారు. తీర ప్రాంతాన్ని అనుకుని ఉన్న డివిజన్‌ లలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ ఫోన్‌ చేయవచ్చునని సూచించారు. ప్రజల సౌలభ్యం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004255990 అన్నివేళలా అందుబాటులో ఉంటుందని చెప్పారు.అన్నదాతల్లో గుబులుఖరీఫ్‌ సీజన్లో 2.40 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు చేయగా ఇప్పటి వరకు సుమారు 1 లక్ష ఎకరాలలో ఇప్పటికే వరి కోతలు పూర్తయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించగా ఇంకా దాదాపు 32 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఇంకా కళ్లాల్లోనే ఉండిపోయింది. ఈనెల 6 వరకూ వరి కోతలను వాయిదా వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో రైతులకు సూచనలు చేశారు. తుపాను నేపథ్యంలో అన్నదాతలు గుబులు గుబులుగా ఉన్నారు. పలువురు ఎక్కడకక్కడ ధాన్యం రాశులపై బరకాలు కప్పి కాపలాగా ఉన్నారు. యంత్రాల ద్వారా కోతలు కోసిన నేపథ్యంలో గత రెండు రోజులుగా ధాన్యంలో తేమశాతం తగ్గకపోవడంతో మొలకలు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిబంధనలను సడలించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని త్వరితగతన సేకరించాలని రైతులు కోరుతున్నారు.

➡️