భార్యను చిత్ర హింసలు పెట్టి.. ఉన్మాది ఆత్మహత్య

Jan 5,2024 20:58

 ప్రజాశక్తి-వేపాడ  :  భార్యను చిత్రహింసలకు గురిచేసి, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఉన్మాది. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని బల్లంకి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… బల్లంకి గ్రామానికి చెందిన చెలిబోని ఈశ్వరరావు (40) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ బాధ్యతను విస్మరించి, భార్య గంగతల్లి, కుమార్తెను హింసించడం అలవాటుగా చేసుకున్నాడు. తాగితే కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఏదైనా పనికి వెళ్లాలని భార్య అడిగితే, ఆమెను కొట్టేవాడు. ఈ నేపథ్యంలో గంగతల్లి వల్లంపూడి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గురువారం ఈశ్వరరావును స్టేషన్‌కు పిలిపించి, ఇకపై సరిగా లేకుంటే చర్యలు తీసుకుంటామని మందలించి, పంపించేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఈశ్వరరావు ఉన్మాదిగా మారాడు. అదేరోజు రాత్రి ఇంటి వద్ద కక్కిరి మట్టతో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయాలైన ఆమె కేకలు వేయడంతో కక్కిరి మట్టతో పీక కోసి, అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆమెను విశాఖలోని కెజిహెచ్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఈశ్వరరావు ట్యాంకుపై నుంచి దూకడంతో అక్కడికక్కడే మరణించాడు. శరీరమంతా తీవ్ర గాయాలు కావడంతో గంగతల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు సుమారు 60 కుట్లు పడ్డాయి. ఈశ్వరరావు తమ్ముడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బివి రమణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శృంగవరపుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

➡️