భూములన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కొత్త చట్టం

Jan 20,2024 00:54

సదస్సులో మాట్లాడుతున్న సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య
ప్రజాశక్తి-సత్తెనపల్లి :
రాష్ట్రంలో భూములన్నీ సులభతరంగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూ హక్కుల చట్టం 2023 తెచ్చిందని సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య అన్నారు. స్థానిక పుతుంబాక భవన్‌లో సీనియర్‌ డిఫెన్స్‌ న్యాయవాది బత్తిన శ్రీనివాసబాబు ఆధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సదస్సులో చలమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నీతి అయోగ్‌ చట్టం చిత్తుగా తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చట్టం చేసి అమలు చేస్తోందన్నారు. ఈ చట్టం పై శాసనసభలో చర్చ లేకుండా ఆమోదించారని, ఇది సరైనది కాదని అన్నారు. దీని వలన రాజకీయ నాయకులు అధికార పార్టీ నాయకులు అధికారుల చేతుల్లో భూమి అధికారాన్ని నిర్ణయించే హక్కు పెట్టడమేనని, పేద రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. దీనిలో క్రింది స్థాయి కోర్టులలో కూడా విచారణ జరగాలని, లేకపోతే డబ్బులు ఉన్న వారి మాట కొనసాగుతుంది తప్ప అధికారులు పేదల మాటలు విని వారికి న్యాయం చేసే పరిస్థితి ఉండదని చెప్పారు. పెత్తందారులు భూ యజమానుల దగ్గర ఉన్న భూమిని లాక్కునేందుకు ఇది ఒక చట్టబద్ధత రూపమని విమర్శించారు. ఈ చట్టంలో అసైన్మెంట్‌ భూములను కూడా అమ్ముకోవచ్చని ఉన్నదని, దీనివలన పేదల చేతుల్లో ఉన్న 26 లక్షల ఎకరాల అసైన్మెంట్‌ భూములు ప్రభుత్వ భూములు కార్పొరేట్‌ శక్తులు లాక్కునేందుకు ఈ చట్టం మరింత సులభతరంగా ఉపయోగపడుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నీటి చట్టంలోనే భారీ పరిశ్రమలకు, ప్రాజెక్టులకు భూములు తీసుకునేందుకు అడ్డంకులు లేకుండా ఉండేందుకే ఈ చట్టం తీసుకువచ్చామని చెప్పారని, అందుకు ప్రతిరూపమే భూ హక్కుల చట్టం 2023 అని అన్నారు. ఈ చట్టాన్ని తిప్పికొట్టేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. బత్తిన శ్రీనివాసబాబు మాట్లాడుతూ ఈ భూ హక్కుల చట్టం రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తుందని, ప్రజాస్వామ్య హక్కులను భంగం కలిగిస్తుంది అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సత్తెనపల్లి పట్టణ అధ్యక్షులు దాసరి జ్ఞాన్‌రాజ్‌పాల్‌ మాట్లాడుతూ ఈ చట్టం పై కనీసం చర్చజరగకుండ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం అప్రజాస్వామికం అన్నారు. జై భీమ్‌ రావ్‌ భారత్‌ పార్టీ నాయకులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయకుమార్‌ మాట్లాడుతూ ఈ చట్టం వలన కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కోసం ప్రచారం చేయాలని అన్నారు. సిపిఎం (ఎంఎల్‌) పార్టీ నాయకులు పాటిబండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ పాలక వర్గాలు బడా పెట్టుబడి దారీ వర్గాలకు ఉపయోగ పడే విధానాలు అమలు చేయడం వల్లనే ఇటువంటి చట్టాలు వస్తున్నాయని అన్నారు. ఈ చట్టం పట్ల ప్రజల అవగాహన కోసం త్వరలో భారీ సదస్సు నిర్వహిస్తామని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ చెప్పారు. సదస్సులో సిహెచ్‌.రాజు, జి.రాజు పాల్గొన్నారు.

➡️