భూ పంపిణీ అంటే ఇదేనా?

Mar 9,2024 21:16

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఎడమ చేతితో ఇచ్చేసి కుడిచేతితో లాగేసుకున్నాడట వెనుకటి ఓ ధర్మదాత. గిరిజనులకు భూమి పంపిణీ, అనగారిన వర్గాలకు కల్పిస్తున్న భూ హక్కుల తీరుతెన్నులు అచ్చంగా అలాగేవున్నాయి. గిరిజన అటవీ హక్కుల చట్టం ప్రకారం వారి సాగులోవున్న భూమి అత్యధికంగా పది ఎకరాల వరకు ఇవ్వవచ్చు. ఇక భూమిలేని దళితులకు అసైన్డ్‌ ల్యాండ్‌ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. పేదలు, వృత్తిదారుల సాగులోవున్న భూములు లాక్కోకూడదన్నది ఏ చట్టమో చెప్పనక్కర్లేదు. మానవత్వం ఉన్న వారెవరైనా ఇట్టే చెప్పగలరు. కానీ, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో ఇవేవీ అమలు కావడం లేదు. 20ఏళ్లుపైబడి సాగులోవున్న అసైన్‌మెట్‌ భూములు సంబంధిత డి-పట్టాదారులకు రెగ్యులర్‌ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎక్కడా అది నామమాత్రంగానే అమలు జరిగింది. మెంటాడ మండలంలోని వందలాది ఎకరాల అసైన్డు, సీలింగ్‌, అటవీశాఖ భూమి గిరిజనులు, దళితులు, పేదలు సాగుచేసుకుని దశాబ్ధాలు తరబడి జీవనం సాగిస్తున్నారు. కాలక్రమంలో ఈ భూములపై పెత్తందార్ల కళ్లుపడ్డాయి. అర్థబలం, రాజకీయ బలంతో తప్పుడు పత్రాలు సృష్టించుకుని లాగేసుకుంటున్నారు. దీనిపై ఆ ప్రాంత అమాయక గిరిజనులు, దళితులు, పేదలు ఎంతమొత్తుకున్నా అధికారులకు వినిపించడం లేదు. పైగా ఆక్రమణదారులకు అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎపి ఆదివాసీ గిరిజన సంఘం, ఎపి వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యాన సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టినా అటు అధికారుల్లోగానీ, ఇటు రాజకీయ నాయకులకుగానీ పట్టడం లేదు. దీంతో, ఆక్రమణదారులకు సాక్షాత్తు డిప్యూటీ సిఎం రాజన్నదొర కొమ్ము కాస్తున్నారని, గిరిజనుడై ఉండి గిరిజనులనే వంచనకు గురిచేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించడమే గిరిజనులు చేసుకున్న పాపమా అంటూ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. నియోజక వర్గంలో 18 కొండలను గుల్ల చేసేందుకు రాజన్నదొర అనుమతిచ్చి బడాబాబుల సేవలో మునిగి తేలుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూరు నియోజకవర్గ పరిధిలో 3200మంది గిరిజనులు పట్టాలు కోసం ఎదురు చూస్తుండగా, ఇప్పటికి కేవలం 490 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సమస్య పరిష్కరించాలని కోరితే మంత్రి తిరిగి ఎదురు దాడి చేస్తున్నారని జనం మండిపడుతున్నారు. దత్తిరాజేరు మండలం చినచామలాపల్లి సర్వే నెంబర్లు 1,2,3,100,101లో ఉన్న సుమారు 50ఎకరాల డి-పట్టా భూమిలో అదే గ్రామానికి చెందిన గొర్రెలు మేకలు పెంచుకుంటూ జీవిస్తున్నారు. ఈ భూమి తప్ప వారికి ఏ ఆధారమూ లేదు. ప్రభుత్వం కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు పేరిట ఈ భూమిని లాగేసు కునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే వృత్తిదారుల జీవనం అస్తవ్యస్తంగా మారనుంది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ వారు తిరగని చోటు లేదు. సిపిఎం ఆధ్వర్యాన స్థానిక తహశీల్దార్‌, ఆర్‌డిఒ, కలెక్టర్‌ వరకు ఎన్నోసార్లు కలిసి వినతిపత్రాలు అందజేశారు. వాటిని అధికారులు ఇప్పటికీ పట్టించుకోకపోవడంతో గొర్రెలు, మేకల పెంపకం దారులు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవేవీ అధికారులు, ప్రజాప్రతినిధులకు పట్టడం లేదని, ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రం రాజకీయ పార్టీలకు చెందిన వారు ఎగేసుకుని తమ వద్దకు వచ్చేస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️