భూ హక్కు చట్టాన్ని-2023ను రద్దు చేయాలి

Dec 20,2023 23:37
దీక్షా శిబిరం నుంచి

ప్రజాశక్తి – పిఠాపురం

ఆంధ్రప్రదేశ్‌ భూమి యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ది బార్‌ అసోసియేషన్‌ పిఠాపురం ఆధ్వర్యంలో బుధవారం న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 12 వ అదనపు జిల్లా కోర్టు దగ్గర నుంచి పట్టణంలో ప్రధాన కూడళ్ళ మీదుగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి, ఉప్పాడ బస్‌స్టాండ్‌ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, న్యాయవాదుల సమ్మె పరిష్కారం చేయాలని, ప్రజల ఆస్తులకు భద్రత లేని ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ను రద్దు చేయాలని, స్థానిక సివిల్‌ కోట్లకు జురెడిక్షన్‌ ఉండాలని, కోర్టులు చేయాల్సిన పని రెవెన్యూ అధికారులకు కట్టబెట్టడం తగదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షులు ఎం. రాజారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎపి న్యూ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను తీసుకువచ్చింద న్నారు. ఈ చట్టం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షుడు ఎస్‌ఎం.అలీ మాట్లాడుతూ ఈ చట్టం ప్రకారం టైటిలింగ్‌ అధికారి, అప్పిలేట్‌ అధికారి వద్ద భూవివాదాలు, ఆస్తి తగాదాలపై వారిచ్చే ఆర్డర్లపై ఆపిల్‌కు వెళ్లాలంటే హైకోర్టులకు మాత్రమే విచారణ పరిధి కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌(ఐలు) జిల్లా ప్రధాన కార్యదర్శి గుదిమెల్ల శ్రీ భాస్కరాచార్యులు, న్యాయ వాదులు బంగారు రామకృష్ణ, పివిఎస్‌ఆర్‌.మూర్తి, కొంజర్ల అప్పారావు, వివి.నగేష్‌, ఎం.సత్యవతి, మహేష్‌, తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రజల ఆస్తులకు భద్రత లేని ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేయాలని కాకినాడ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదలు మూడవ రోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. దీక్షా శిబిరం నుంచి ప్రదర్శనగా జడ్‌పి సెంటర్‌ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్‌ సెక్రటరీ చెక్కా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎపి ప్రభుత్వం చీకటిలో తీసుకువచ్చిన ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల ప్రజల ఆస్తులకు భద్రత లేదని తెలిపారు. ఈ చట్టంలో ప్రభుత్వం నియమించిన అధికారులకు సివిల్‌ చట్టం పట్ల అవగాహన లేకుండా ప్రజా ప్రతినిధులు చెప్పు చేతల్లో పనిచేసే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ ప్రెసిడెంట్‌ ముత్తంటి విశ్వేశ్వరరావు, సీనియర్‌ న్యాయవాదులు జవహర్‌ ఆలీ, కాకర్ల వెంకటేశ్వరరావు, బొగ్గవరపు గోకుల కృష్ణ, బి.రాధాకృష్ణ పాల్గొనగా, రిలే నిరాహారదీక్షలో సీనియర్‌ న్యాయవాదులు ఎవిసిహెచ్‌ఎస్‌.మూర్తి, జెబి.శర్మ, రామ్‌ మోహన్‌, అనీల్‌, రాధాకృష్ణ, శకుంతల, రాజబాబు, వెంకటరావు కూర్చున్నారు.

➡️