మంచి చేసే వారికే పట్టం కట్టండి : బొత్స

Mar 14,2024 21:59

ప్రజాశక్తి – వీరఘట్టం, వంగర  : ప్రజలకు మంచి చేసే వారికి రానున్న ఎన్నికల్లో పట్టం కట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలను కోరారు. మండలంలోని కిమ్మిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రంతో పాటు రూ.27.5 కోట్లతో నిర్మించిన వంతెనను పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, విద్యాదీవెన, జగనన్న విద్యా కానుక, ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని అన్నారు. . సచివాలయానికి 35 మంది ఉద్యోగులను నియమించి అన్ని రకాల సేవలందిస్తున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో పథకాలన్నీ రావాలంటే ఇక్కడ ఎమ్మెల్యే కళావతిని, ఎంపీగా భాగ్యలక్ష్మిని గెలిపించాలన్నారు. నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కిమ్మి వంతెనకు అనుమతులిస్తే ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి పాలనలో వంతెను ప్రారంభించడం సంతోషకర మన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేశారన్నారు. ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్‌ మాట్లాడుతూ వంతెన ప్రారంభించడం వల్ల అటు రాజాం, ఇటు పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలాల ప్రజల రాకపోకలకు అనువుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జి.రామ్మోహన రావు, ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు, జడ్‌పిటిసి జంపు కన్నతల్లి, సీతంపేట ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి, పాలకొండ ఎఎంసి ఉపాధ్యక్షులు పి.లక్ష్మణరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కర్రి గోవిందరావు, ఎంఎఇసి చైర్మన్‌ కర్రి లీలాప్రసాద్‌, హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్‌ భోగి లతా మాణిక్య చంద్రశేఖర్‌, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ రంభ శ్రీనివాసరావు, ఎఎంసి డైరెక్టర్‌ కె.ఆంజనేయులు, వంగర ఎంపిపి ముఖర్జీ, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️