మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Feb 3,2024 21:06

ప్రజాశక్తి – పాచిపెంట :మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎంఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె.సుభాషిని, వై.మంగమ్మ, సిహెచ్‌ రామకోలా, జి.కల్యాణి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేలు వేతనం చెల్లిస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. అనేక కష్టనష్టాలకు ఓర్చి పిల్లలకు వేడివేడి అన్నం పెట్టి తమ ఆరోగ్యాలను కూడా లెక్కచేయకుండా పనిచేసిన వంటమ్మలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రెండు జతలు యూనిఫాం ఇవ్వాలని, ప్రభుత్వమే గ్యాస్‌ సరఫరా చేయాలని,రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా కల్పించాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలన్నారు. రాజకీయ వేధింపులు మానుకొని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంట చేస్తుండగా సంభవించిన ప్రమాదం ఏర్పడి చనిపోయిన రమాదేవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే భవిష్యత్‌ పోరాటాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అనంతరం ఎంఇఒ-2 పి.సతీష్‌ కుమార్‌కు వినతిని అందజేశారు. కార్యక్రమంలో పలువురు మధ్యాహ్నభోజన కార్మికులు పాల్గొన్నారు.బలిజిపేట : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎంఇఒ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం అధ్యక్షులు యు.లక్ష్మి, కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ దీర్ఘకాలంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదని, దీంతో ఈ పథకం నిర్వహణ చాలా కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ మెనూ మారుస్తున్నప్పటికీ మెస్‌ ఛార్జీలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు జీతాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మెనూ ఛార్జీలు, జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై ఈనెల 5న డిఇఒ కార్యాలయం వద్ద జరుగు ధర్నాలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు యూనియన్‌ నాయకులు లక్ష్మి, భవాని, తెరేజా, భాగ్యం, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️