మన్యంలో మరణ మృదంగం

Feb 20,2024 21:02

ప్రజాశక్తి – సాలూరు : జిల్లాలో గిరిజన విద్యార్థుల మరణ మృదంగం మోగుతోంది. జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో 16మంది విద్యార్థులు వివిధ అనారోగ్య కారణాల రీత్యా మృత్యువాతపడ్డారు. గిరిజన విద్యార్థుల వరుస మరణాలతో వారి తల్లిదండ్రుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. సాక్ష్యాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సొంత నియోజకవర్గం పరిధిలోని వారం రోజుల వ్యవధిలో ఇద్దరు యుక్త వయసు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వీరద్దరి మరణానికి ప్రధాన కారణం రక్తహీనతేనని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నప్పుడు విద్యార్ధులు రక్తహీనతతో ఎందుకు మరణిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. గత శనివారం మక్కువ మండలం ఎర్రసామంత వలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి విద్యార్ధి సీదరపు అశోక్‌ మృతి చెందాడు. అశోక్‌ కూడా రక్తహీనత కారణంగానే ఆయాసం రావడంతో శంబర పిహెచ్‌సిలో చేర్పించారు. అక్కడ నుంచి కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్ధి అశోక్‌ మరణించాడు. ఆ మరణం నుంచి తేరుకోక ముందే మంగళవారం పాచిపెంట మండలం సరాయివలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని పుంగారి అనిత కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. వారం రోజుల క్రితం రుతు చక్రంలో భాగంగా రక్తస్రావం జరగడంతో గురివినాయుడు పేట పిహెచ్‌ సికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కెజిహెచ్‌కి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు మృతి చెందింది. అనిత కూడా రక్తహీనత కారణంగానే మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో రక్తహీనత నివారణకు చిక్కీలు, రాగి జావ పంపిణీ చేస్తున్నారు.అయినా రక్తహీనతతో మరణాలు సంభవి స్తుండడంతో గిరిజనుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.ఎఎన్‌ఎం ల నియామకమేదీ?గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తునే ఉంది. అయినా ప్రభుత్వం నుంచి ఆదిశగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆడపిల్ల లకు రజస్వల అవ్వగానే తల్లిదండ్రులు వివాహాలు చేస్తుంటారు. అంటే 15ఏళ్లకే గిరిజన ప్రాంతాల్లో వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని వల్ల 20 ఏళ్లకే ఇద్దరు పిల్లలను పొందుతున్నారు. ఫలితంగా పుట్టిన పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా వుంటోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నా అవి నాణ్యతలేనివేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుట్టుకతోనే గిరిజన పిల్లలు రక్తహీనతతో పుడతారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నా రక్తహీనత వెంటాడుతూనే ఉంది. పాఠశాలల్లో తరచూ విద్యార్ధులకు వైద్య పరీక్షలు చేయడానికి వైద్య సిబ్బంది లేకపోవడం వల్లనే యాజమాన్యాలు పిల్లల ఆరోగ్యాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్ధులు అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారు.తల్లిదండ్రులకు పరిహారం చెల్లించాలి: ఎస్‌ఎఫ్‌ఐగిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వరుసగా విద్యార్థుల మరణానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పండు అన్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మరణిం చారు. ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమిం చాలని చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రక్తహీనతతో మరణించడం ఆందోళన రేకెత్తిస్తోంది. విద్యార్ధుల కుటుంబాలకు పది లక్షల పరిహారం చెల్లించాలి.

➡️