మరింతగా కేంద్ర బలగాలను కోరాం : జెసి

Mar 27,2024 22:53

ప్రజాశక్తి – మాచర్ల : మాచర్ల నియోజకవర్గంలో 135 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ ప్రసాదు అన్నారు. స్ధానిక తహశీల్దార్‌ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ శాంతి, భద్రతలను కాపాడేందుకు కేంద్ర బలగాలను కోరినట్లు తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద సిసి కెమోరాలను ఏర్పాటు చేశామని, నిఘా మరింత పెంచుతామని అన్నారు. ఇప్పటికే 1,904 లీటర్లు మద్యం, నగదు పట్టుకున్నట్లు చెప్పారు. రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణిస్తే తగిన ఆధారాలు చూపాలలని, లేకుంటే సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లఘించిన ఐదుగురు ఉద్యోగులపై వేటు వేశామని, వీరిలో నలుగురు వాలంటీర్లు, ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం తరుపున విధులు నిర్వహించే వారు, ప్రభుత్వం నుండి వేతనాలు పొందే వారు రాజకీయ పార్టీల కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. నెంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కొంతమంది వాహనదారులకు పెనాల్టీలు విధించామని చెప్పారు. గురువారం ఉదయం ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 31వ తేదికి 18 ఏళ్లు నిండే వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓట్లు తొలగింపు కొరకు తీసుకునే ఫారమ్‌-7 ఇకపై స్వీకరించబోమని తెలిపారు. ఎన్నికలను ప్రశాతంగా నిర్వహించేందుకు ఇప్పటికే 635 మందిని బైండోవర్‌ చేశామని, అవసరమైతే మరి కొందర్నీ చేస్తామని తెలిపారు. ఎన్నికలకు ఆటంకం కల్పించే వారిని ఎన్నికల రోజు ముందుగా ఓటు వేయించి వారిని అదుపులోకి తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. బిఎస్‌పి అభ్యర్ధి తనకు పోలీసు బందోబస్తు కావాలని కోరినట్లు తెలిపారు. సమావేశంలో తహశీల్దార్‌ డి.మంజునాధరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ డి.వెంకటదాసు, డిటి జానిబాషా పాల్గొన్నారు.

➡️