మరో అవినీతి బాగోతం!

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎకౌంట్స్‌ విభాగంలో అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి. గతేడాది అక్టోబరులో కాంట్రాక్టర్లకు సంబంధించిన రూ.47.09 లక్షలను దారిమళ్లించి స్వాహా చేసిన ఎకౌంటెంట్‌ సిరిల్‌ పాల్‌ను గతేడాది నవంబరు 3న కమిషనర్‌ చేకూరి కీర్తి సస్పెండ్‌ చేశారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన సొమ్మును బ్యాంకు నుంచి వేరే ఖాతాలకు రూ.47 లక్షలు మళ్లించారు. అయినా ఇంత వరకు ఒక్కరూపాయి కూడా రికవరి చేయలేదు. సిరిల్‌పాల్‌ సైబర్‌, ఆర్థికనేరానికి పాల్పడినా సంబంధం లేని వ్యక్తుల ఖాతాలకు నిధులు మళ్లించినా ఇంత వరకు ఈ నిధులను రికవరి చేయలేకపోయారు. సిరిల్‌పాల్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 15 రోజుల తరువాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా శాశ్వత ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పిఎఫ్‌., ఇపిఎఫ్‌ ఖాతాల నుంచి తీసుకునే రుణాల్లో కొంత సొమ్మును కార్పొరేషన్‌లోని ఎకౌంట్స్‌ విభాగంలోని కొంత మంది ఉద్యోగులు స్వాహా చేసినట్టు తెలిసింది. దాదాపు 90 మంది ఉద్యోగులకు చెందిన రూ.25 లక్షలు స్వాహా చేసినట్టు కార్పొరేషన్‌లో కొంతమంది అధికారులకు తెలిసినా వారు మౌనం వహించారు. శాశ్వత ఉద్యోగులు పిఎఫ్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే కార్పొరేషన్‌ కమిషనర్‌ అనుమతిస్తారు. అయితే వారు దరఖాస్తు చేసుకున్న సొమ్ముకు అదనంగా కొంత మొత్తం జమచేసి వాస్తవంగా దరఖాస్తు చేసిన సొమ్మును ఉద్యోగి ఖాతాకు, మిగతా సొమ్ము ఇతర ఖాతాలకు మళ్లించి స్వాహా చేస్తున్నారు. ఉద్యోగులకు అనుమానం రాకుండా ఈ తతంగం నడుపుతున్నారు. అనధికారికంగా రుణం మంజూరు చేసినందుకు పర్సంటేజి తీసుకుంటూనే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. కొంతమంది ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎక్సౌంట్స్‌ విభాగంలో పనిచేయడం వల్ల వీరు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కమిషనర్‌ మంజూరు చేసిన రణానికి, వాస్తవంగా ఉద్యోగి ఖాతా నుంచి రుణంగా డ్రా చేసిన మొత్తంకు భారీ వ్యత్యాసం ఉంటోంది. చాలామంది ఉద్యోగులు ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి ఈ అంశంపై సిఎం వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇపిఎఫ్‌ రుణాల్లోనూ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. పారిశుద్య కార్మికులు ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండటం వల్ల వారిని ఎకౌంట్స్‌ సెక్షన్‌ ఉద్యోగులు రుణాల మంజూరులో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై కార్పొరేషన్‌లో ఒక అధికారి అంతర్గత విచారణ చేసి కమిషనర్‌కు నివేదిక ఇవ్వకుండా మిన్నకుండిపోయారని తెలిసింది. కాంట్రాక్టర్ల సొమ్ము రికవరీపై ప్రతిష్టంభనఎకౌంటెంట్‌ సిరిల్‌పాల్‌ దారిమళ్లించి స్వాహా చేసిన తమ సొమ్ము రికవరిపై కమిషనర్‌ కూడా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు తరచూ మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడ్ని కలిసి ఒత్తిడి చేస్తున్నారు. కమిషనర్‌ను కలిసినా ఇంతవరకు చర్యల్లేవు. కార్పొరేషన్‌ నుంచి రూ.47 లక్షలు కాంట్రాక్టర్లకు చెల్లించినట్టు చూపి వాటిని ఇతర ఖాతాల్లో జమయ్యేలా చేసిన సిరిల్‌ పాల్‌ ఆస్తుల జప్తు చేయలేదు. ఏ ఖాతాలో జమయ్యాయో ఆయా ఖాతాలను సీజ్‌ చేయలేదు. కేవలం పోలీసు కేసు పెట్టి చేతులు దులుపుకొన్నారని విమర్శలు వస్తున్నాయి.

➡️