మలివిడత మార్పులపై ఉత్కంఠ!

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వైసిపి అధిష్టానం సూత్రప్రాయంగా ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలకు జంబ్లింగ్‌ పద్ధతిలో మార్పులు చేశారు. ప్రస్తుతం గుంటూరు, బాపట్ల లోక్‌సభ స్థానాల పరిధిలో ఎక్కువ మందికి స్థాన చలనం కల్పించారు. పార్టీలో సీనియార్టితో సంబంధం లేకుండా కొత్తవారికి ఇన్‌ఛార్జిల రూపంలో అభ్యర్థులను ప్రకటించారని వైసిపి నేతల్లో ప్రచారమవుతోంది. ఈసారి మలివిడత జాబితాలో పల్నాడు జిల్లాకు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండనున్నారు. సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు అవకాశం ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. పల్నాడు జిల్లాలో ఒక బిసి సామాజిక తరగతి వారికి అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో గురజాల, నరసరావుపేట ఎమ్మెల్యేలలో స్థాన చలనం ఉంటుందనే ప్రచారం ఉంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌కు ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి అవకాశం కల్పిస్తారని తెలిసింది. గిరిధర్‌ గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తారని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నెల రోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఆయన ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఆకస్మికంగా మంత్రి విడదల రజనీకి పశ్చిమ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించడంతో గిరిధర్‌ మనస్థాపానికి గురయ్యారు. ఆయన్ను బుధవారం తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయానికి రావాలని పిలుపువచ్చింది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి నర్సరావుపేటకు రావాలని ప్రయత్నిస్తున్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది నాయకులు ఇప్పటికే అసమ్మతి కుంపటి రాజేశారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటికి స్థాన చలనం తప్పదనే ప్రచారం బలంగా ఉంది. వివిధ ఏజన్సీల ద్వారా నిర్వహిస్తున్న సర్వేల ఆధారంగా మార్పులు చేస్తున్నారని వైసిపికి చెందిన సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకోవడం, వివాదాలకుఆస్కారం లేకుండా కొత్తవారిని ఎంపిక చేయాలన్న తలంపు కూడా ఉందని చెబుతున్నారు. అన్నింటికన్నా ఆర్థికపరమైన అంశాలు అభ్యర్థుల ఎంపికలో కీలక భూమిక పోషిస్తున్నాయని సీనియర్లు వాపోతున్నారు. ఇందులో భాగంగానే క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన వ్యాపార వేత్త, వైసిపి నాయకుడు హనిమిరెడ్డిని బాపట్ల జిల్లా అద్ధంకి వైసిపి ఇన్‌ఛార్జిగా అవకాశం కల్పించారు. సీనియర్లు, సిట్టింగ్‌ల కంటే కొత్తముఖాలకే ప్రాధాన్యమిస్తున్నారు. మలివిడత మార్పుల్లో పొన్నూరు, తెనాలి, గుంటూరు తూర్పులపై దృష్టి సారించనున్నారు. ఈ మూడింటిలో పొన్నూరుకు కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలిసింది. గుంటూరు తూర్పులో నూరిఫాతిమా, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్‌ దాదాపు కొనసాగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో మీకు అవకావం ఇవ్వలేమని, ఆ తరువాత ఏదో విధంగా న్యాయం చేస్తామని ఉమ్మడి జిల్లాలో 10 మందికి స్పష్టం చేసినట్టు సమాచారం.

➡️