మలుపు తిరుగుతున్న డీలక్స్‌ స్థలం వివాదం

ప్రజాశక్తి – సాలూరు: పట్టణం నడిబొడ్డున ఉన్న వెంకటేశ్వరా డీలక్స్‌ స్థలం వివాదం మలుపులు తిరుగుతోంది. మున్సిపల్‌ అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది. ఈ స్థలం చుట్టూ వివాదాలు అల్లుకొని ఉండడంతో ఎటూ తేల్చుకోలేక అధికారులు సతమతమవుతున్నారు. 2020లో పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తులు సర్వే నెంబర్‌ 159/2లో ఉన్న 119.83, 100.70,815 చదరపు గజాల స్థలాలను కొనుగోలు చేశారు. స్థానిక జమిందార్‌ కుటుంబానికి చెందిన రాజేంద్ర మణిదేవి పేరున ఉన్న ఈ స్థలాలను పిబిఎస్‌ విక్రం చంద్ర సన్యాసి రాజు, పిబిఎస్‌ నారాయణ రాజుల పేర వారసత్వ సంపదగా మార్పు చేశారు. వీరి నుంచి ప్రయివేటు వ్యక్తులు కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 2020లోనే కొనుగోలు చేసిన తమ ఆస్తికి పన్ను కొట్టించుకోవాలని ప్రయివేటు వ్యక్తులు కోరుతున్నారు. పన్ను కొట్టించుకోవాలని వారు హైకోర్టులో కేసు వేశారు. 8వారాల్లో విచారణ జరిపి పన్ను కొట్టించుకోవాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కొద్ది రోజుల క్రితం మున్సిపల్‌ కమిషనర్‌ జయరాం కొనుగోలుదారులు, విక్రయదారులను పిలిచి విచారించారు. వారి వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించారు. మున్సిపాలిటీకి రావాల్సిన పన్ను బకాయిలపై అధికారులు దృష్టి సారించారు. దీనిలో భాగంగా పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయాలని భావిస్తున్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల జీతభత్యాల పంపిణీ సక్రమంగా జరగాలంటే సాధారణ నిధి పుష్కలంగా ఉండాలి. సాధారణ నిధి ఖాళీ కావడంతో అధికారులు బకాయిలపై దృష్టి సారించారు. డీలక్స్‌ స్థలాలకు సంబంధించిన పన్నులు కొట్టించుకోవాలని కొనుగోలుదారులు మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొంతమంది అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని గతంలో పని చేసిన అధికారులు పట్టించుకోలేదు. కానీ ఇటీవల కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మున్సిపల్‌ అధికారులకు ఉంది. అయితే మంగళవారం దేవాదాయ శాఖ జిల్లా అధికారి మున్సిపల్‌ కమిషనర్‌కు ఓ లేఖ పంపించారు. సర్వే నెంబర్‌ 159/2లో ఉన్న డీలక్స్‌ స్థలం వివాదం ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌లో ఉన్నందున దానిపై ఎలాంటి మ్యుటేషన్‌ లు చేయవద్దని కోరారు. గతంలోనూ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ ఎసి ఈ స్థలంపై నివేదిక సమర్పించారు. ఈ స్థలం దేవాదాయ శాఖ దేనని ఎసి నివేదికలో పేర్కొన్నారు. అన్ని ఆధారాలతో కూడిన ధ్రువపత్రాలు తమ వద్ద ఉన్నాయని, పన్ను కొట్టించుకోవాలని కొనుగోలు దారులు కోరుతున్నారు. సుమారు 50ఏళ్లుగా జమిందారీ కుటుంబీకులు ఈ ఆస్తులపై మున్సిపాల్టీకి పన్ను కడుతున్నారని, మరి తమ వద్ద ఎందుకు కట్టించుకోవడంలేదని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కమిషనర్‌ జయరాంను వివరణ కోరగా మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సలహా మేరకు ఈ విషయం లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

➡️