మలేరియా ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

Mar 6,2024 21:33

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : మలేరియా ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సబ్‌ యూనిట్‌ అధికారులు, మలేరియా టెక్నికల్‌ సూపర్‌ వైజర్లకు జిల్లా మలేరియా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆరోగ్య సర్వే చేపట్టి గ్రామాలు, వసతి గృహాలు, పట్టణాల్లో జ్వర లక్షణాలున్న వారిని గుర్తించాలన్నారు. మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు సత్వరమే జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. మీ పరిధిలో ఉండే మండలాల్లో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకుని, జ్వర ప్రభావిత ప్రాంతాలు, వాటి నివేదికలు, శానిటేషన్‌ ప్రక్రియ, డ్రైడే కార్యక్రమాలు, స్ప్రేయింగ్‌ తదితర అంశాలపై చర్చించి తగు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్‌ పరీక్షల నివేదికలు, రికార్డులు తరచుగా పరిశీలించాలన్నారు. వసతిగృహాలను సందర్శించి, అక్కడ కిటికీలకు మెస్‌ల అమరిక తీరు, సిక్‌ రూం నిర్వహణ, కిచెన్‌, హాస్టల్‌ పరిసరాల్లో శానిటేషన్‌ తీరును గమనించాలన్నారు. ఎక్కడైనా జ్వరాలు నిర్ధారణ అయితే వెంటనే తెలియజేయాలని సూచించారు. సమావేశంలో ఎఎంఒ సూర్యనారాయణ, మలేరియా కన్సల్టెంట్‌ రామచంద్ర, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️