మలేరియా ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించాలి

Mar 28,2024 21:37

ప్రజాశక్తి – పాచిపెంట/సాలూరురూరల్‌: జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించాలని ఎన్‌విబిడిసి రాష్ట్ర ఉప సంచాలకులు ఎటి రామనాధరావు అన్నారు. ఎన్‌విబిడిసి రాష్ట్ర ఉప సంచాలకులు జిల్లాలో గురువారం పర్యటించారు. తోణాం, పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. మలేరియా, డెంగీ మొదలగు జ్వరాలు నమోదు వివరాలు, నిర్ధారణ పరీక్షలు, అందజేస్తున్న చికిత్సా వివరాలపై సిబ్బందిని ఆరా తీశారు. ఎమ్‌-3, ఎమ్‌ఎఫ్‌-7 ల్యాబ్‌ రికార్డులను పరిశీలించి నివేదికలు స్పష్టంగా ఉండాలని ల్యాబ్‌ సిబ్బందిని ఆదేశించారు. జ్వర లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన వారికి రక్తపూతలు సేకరించాలన్నారు. మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఫీవర్‌ సర్వలెన్స్‌, ఫోకల్‌ స్ప్రేయింగ్‌ తదితర నివారణ చర్యలు చేపడుతున్న తీరుపై క్షేత్రస్థాయి సిబ్బందిని ఆరా తీశారు. వ. ఆ ప్రాంతంలో జ్వర నిర్ధారణ సామూహిక రక్త పరీక్షలు నిర్వహించి, దోమల వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా రామనాధరావు మాట్లాడుతూ జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు ఫీవర్‌ సర్వలెన్స్‌ చేపట్టాలని తద్వారా మలేరియా, డెంగీ జ్వరాలు త్వరితగతిన గుర్తించి, చికిత్స అందజేయడం, అదేవిధంగా దోమల వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టడం తదితర కార్యచరణ ప్రణాళిక ప్రకారం చేపట్టాలన్నారు. తద్వారా రానున్న వర్షాకాలంలో జ్వరాలు ప్రబలకుండా అదుపులో ఉంటాయన్నారు. శాఖల సమన్వయంతో జిల్లా, మండల స్థాయి సమావేశాలు నిర్వహించి దోమల వ్యాప్తి నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత అంశాలపై సమీక్షలు జరపాలన్నారు. డ్రైడే పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పర్చాలన్నారు. జిల్లాలో దోమల మందు స్ప్రేయింగ్‌కు ఎంపికైన 401 గ్రామాల్లో మొదటి విడత స్ప్రేయింగ్‌ మే15 నుంచి ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు, ఎఎంఒలు సూర్యనారాయణ, డివి రమణ, జిల్లా విబిడి కన్సల్టెంట్‌ రామచంద్ర, వైద్యాధికారులు డాక్టర్‌ వెంకట రమణ, డాక్టర్‌ సుజాత, సబ్‌ యూనిట్‌ అధికారి ఈశ్వరరావు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

➡️