మల్లు స్వరాజ్యం మాటే స్ఫూర్తి

Mar 19,2024 23:53

ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాటే స్ఫూర్తిదాయకమని, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. కొలనుకొండలోని జాతీయ రహదారి వద్ద ఉన్న ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో మల్లు స్వరాజ్యం రెండో వర్ధంతి సభ మంగళవారం నిర్వహించారు. స్వరాజ్యం చిత్రపటానికి రమాదేవి, ఇతర నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం 14 ఏళ్ల వయసులోనే భూమికోసం, భుక్తి కోసం జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. తుదిశ్వాస వరకూ కమ్యూనిస్టుగా ఉన్నారని, ప్రజా సమస్యల అలుపెరగని పోరాటం చేశారని చెప్పారు. మహిళలు కర్రలు చేత పట్టుకుంటేనే మహిళా సమస్యలు పారదోలగలమని స్వరాజ్యం అంటూ ఉండేవారని గుర్తు చేశారు. భారతమాత, కనకదుర్గ, శక్తి స్వరూపిణి అంటారు గానీ బిల్కిస్‌బానో, మణిపూర్‌ మహిళలు శక్తులు కాదా అని ఆమె ప్రశ్నించారు. స్వరాజ్యం చనిపోయేంతవరకు ఆమెను చూడడానికి వెళ్లిన వారందరికీ సెల్యూట్‌ చెప్పి, స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఐద్వా నాయకులు సుధా అన్నారు. నిరంతరం మహిళా సమస్యల పైన స్వరాజ్యం మాట్లాడేవారని చెప్పారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు డి.శ్రీనివాస్‌కుమారి, పి.గిరిజ, పార్వతి, రమణమ్మ పాల్గొన్నారు.
సుందరయ్య నగర్‌లో మల్లు స్వరాజ్యం వర్థంతి
ప్రజాశక్తి-గుంటూరు : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 2వ వర్ధంతి సభ మంగళవారం స్థానిక 41వ డివిజన్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌లో స్థానిక శాఖ కార్యదర్శి షేక్‌.ఖాసిం షహీద్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఐద్వా, సిఐటియు, కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్షులు జి.రమణ మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం చిన్న వయసులోనే పేదల కోసం, కూలిరేట్ల పెంపు కోసం సొంత మనుషులతోనే పోరాడి రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం నడిపిన వీర వనిత అని, చట్టసభల్లో మహిళా సమస్యల మీద తన గళాన్ని వినిపించారన్నారు. సిఐటియు నాయకులు ఆది నికల్సన్‌ మాట్లాడుతూ పేదల కోసం నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకి పట్టి సాయుధ పోరాటం చేసిన మొదటి వీరవనిత అని, తుది శ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాలలోనే మమేకమయ్యారని, ఆమె జీవితం మహిళలందరికీ ఆదర్శమని చెప్పారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి నాయకులు జి.లూథర్‌పాల్‌, వివిధ సంఘాల నాయకులు ఎం.అచ్యుత కుమారి, ఆదిలక్ష్మి, కె.పద్మ, ఎస్‌.పద్మనాభుడు, ఆదిబాబు పాల్గొన్నారు.

➡️