మహిళలు పారిశ్రామికంగా ఎదగాలి

Dec 20,2023 20:18

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, అందుబాటు లో ఉన్న వనరులను వినియోగించుకుంటూ జిల్లా అవసరాలకు తగ్గట్టుగా వ్యాపారాలను విస్తరించుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి మహిళలకు సూచించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ రానున్న దృష్ట్యా ఇప్పటినుండే ప్రణాళికలు తయారు చేసుకోవాలని తెలిపారు. బుధవారం మహిళా ప్రాంగణం సందర్శించి జిల్లా సమాఖ్య సమావేశం లో పాల్గొని కలెక్టర్‌ ప్రసంగించారు. తొలుత మహిళా ప్రాంగణం ఆవరణలో మొక్కలు నాటి, మహిళలతో నిర్వహించబడుతున్న నర్సరీని సందర్శించారు. అదే ఆవరణ లో కూరగాయల విత్తనాలను చల్లి మహిళలతో ముచ్చటించారు. నర్సరీ వలన, అక్కడ పండిస్తున్న కూరగాయలు, పూల వలన నెలకు ఎంత సంపాదిస్తున్నారని వివరాలను అడిగారు. అనంతరం జరిగిన సమావేశంలో మహిళలతో ముఖా ముఖి ముచ్చటించారు. జిల్లా సమాఖ్య ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను, వారు చేస్తున్న వ్యాపారాలను, కార్యకలాపాలను కలెక్టర్‌ కు సమాఖ్య ఇసి సభ్యులు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా మహిళలు, పిల్లల్లో రక్త హీనత లేకుండా అవగాహన కలిగించాలని తెలిపారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, బాల్య వివాహాల వలన కలిగే దుష్ప్రభావాలపై గ్రామాల్లో చైతన్యం కలిగించాలని తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాలు పూర్తిగా ఆగిపోవాలని, అందుకు మహిళలు నడుం కట్టాలని అన్నారు. ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా 5 రకాల క్రీడలలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకోసం ప్రతి ఒక్కరూ సచివాలయ పరిధి లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లా సమాఖ్య ద్వారా అనేక ఆర్థిక కార్య కలాపాలు జరుపుతూ రూ.7.8 కోట్లు డిపాజిట్‌ చేసుకున్నారని వివరించారు. పౌల్ట్రీ , డైరీ, మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ తదితర వ్యాపారాలకు రుణాల కోసం బ్యాంకు లు కూడా ముందుకు వస్తున్నాయని తెలిపారు. సమావేశంలో ఎపిడి సావిత్రి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు వెంకట లక్ష్మి, మండల సమాఖ్య అధ్యక్షులు, ఇసి సభ్యులు, డిపిఎంలు పాల్గొన్నారు.

➡️