మానవహారంతో అంగన్‌వాడీల నిరసన

Dec 22,2023 20:29
ఫొటో : నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు

ఫొటో : నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు
మానవహారంతో అంగన్‌వాడీల నిరసన
ప్రజాశక్తి-మర్రిపాడు : నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు తమ డిమాండ్‌ల సాధన కోసం మానవహారంగా ఏర్పడి ట్రాపిక్‌ను స్థంభింప చేసి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో అనంతసాగరం సిఐటియు మండల కార్యదర్శి షేక్‌ అన్వర్‌బాషా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో తెలంగాణా అంగన్‌వాడీల కంటే రూ.1000 కంటే ఎక్కువ వేతనం ఇస్తానని హామీనిచ్చారని, కానీ ఆయన మాట తప్పారని విమర్శించారు. పక్క రాష్ట్రంలో రూ.13500లు నుండి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.18వేలు వేతనం ఇచ్చేందుకు హామీనిచ్చిందన్నారు. ఎపిలో అంగన్‌వాడీలకు రూ.11500లు జీతం ఇస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జీతాలు తప్ప అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంగన్‌వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా లేరని సంక్షేమ పథకాలైన అమ్మఒడి, విద్యాదీవెన వంటివి అందడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రూ.26వేల కనీస వేతనం, గ్రాట్యూటీ, పదవీ విరమణ తర్వాత రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకులు నాశిరకంగా ఉన్నాయని, నాణ్యత కలిగిన వాటిని ఇవ్వాలన్నారు. గ్యాస్‌ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు. అంగన్‌వాడీలు సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మెలో పాల్గొనగా సచివాలయ సిబ్బంది అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగుల గొట్టడంపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రత్నయ్య, సిపిఎం మండల కార్యదర్శి రహంతుల్లా, సీనియర్‌ నాయకులు సూర్యనారాయణ అనంతసాగరం ప్రాజెక్టు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సునీత, లక్ష్మీ, వసుంధర, నూర్జహాన్‌, భాగ్యమ్మ, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

➡️