మా గ్రామాల విలీనం వద్దు

Feb 7,2024 21:16

ప్రజాశక్తి-సాలూరు : మున్సిపాలిటీలో కూర్మరాజుపేట, జీగిరాం, నెలిపర్తి గ్రామాలను విలీనం చేయొద్దని కోరుతూ బుధవారం ఆయా గ్రామాల నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ పి.ప్రసన్నవాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. కూర్మరాజుపేట సర్పంచ్‌ ఆముదాల నళిని ఆధ్వర్యాన గ్రామస్తులు, జీగిరాం, నెలిపర్తి నాయకులు వై.గణపతి, గాంధీ,బంగారి సురేష్‌ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలోనూ ఈ ప్రతిపాదన తీసుకొస్తే గ్రామస్తులంతా తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రతిపాదనను తెరపైకి తేవడం సరికాదని తెలిపారు. గ్రామాల్లో ఉన్నవారంతా బలహీనవర్గాల కుటుంబాలేనని, మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల పన్నుల భారం పడుతుందని చెప్పారు. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని, లేకపోతే తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూర్మరాజుపేట నాయకులు కోటేశ్వరరావు, వెంకట్రావు, ఈశ్వరరావు, సింహాచలం, మోహన్‌ రావు పాల్గొన్నారు.

➡️