మిచౌంగ్‌ ముప్పు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : బంగాళఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చలిగాలులు పెరిగాయి. వృద్దులు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మిచౌంగ్‌ తుపాను తీవ్రత వల్ల ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. నిజాంపట్నం హార్బర్‌లో సోమవారం 10వ నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. మొత్తం 11 ప్రమాద హెచ్చరికలు ఉండగా 10 నంబరు ఎగురవేయడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాపై తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బాపట్ల-మచిలీపట్నం మధ్య నిజాంపట్నం సమీపంలో తీరం దాటనుంది. ఉమ్మడి జిల్లాలో అతి దగ్గరగా ఉన్న నిజాంపట్నం వద్ద తీరం తాకితే తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు. కావలికి సమీపంలో ఉన్న తుపాను గంటకు 10 కిలో మీటర్ల వేగంతో కదిలి మంగళవారం ఉదయం కల్లా నిజాంపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉండటంతో .జిల్లాకు ఎక్కువగా నష్టం ఉంటుందని చెబుతున్నారు. ఈ తుపాను తీవ్రత వల్ల తెనాలి డివిజన్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిసింది. ఇప్పటికే జిల్లాలోని డెల్టా ప్రాంతంలో వరి పనలపై ఉన్న పంటకు తీవ్ర నష్టం జరిగింది. వరి పంట తడిసిపోయింది. గాలి తీవ్రత వల్ల తెనాలి, పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాలోని గ్రామాల్లో వరి పైరు నేలవాలింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పొలాల్లో నీరు చేరుతుండటంతో నీటిని బయటకు పంపేందుకు రైతులు శ్రమిస్తున్నారు. మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ముంపు సమస్యను బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా వరి కోతలకు సిద్ధంగా ఉన్న ప్రాంతాల్లో కంకులు నేలవాలితే నీటిలో మునిగి మొలకెత్తే ఉండటం వల్ల రైతులు నానా తిప్పలు పడుతున్నారు. పొన్నూరు, చేబ్రోలు, తెనాలి, కొల్లిపర, పెదకాకాని, మంగళగిరి, కాకుమాను, పెదనందిపాడు తదితర మండలాల్లో కోతలకు వచ్చిన వరికి నష్టం కలిగే ప్రమాదం ఏర్పడింది. మెట్ట ప్రాంతంలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. జోరు వాన వల్ల పూత, కాయదెబ్బతింది. తీయడానికి సిద్దంగా ఉన్న పత్తి నేలరాలిపోతోంది. మిర్చి పైరుకు ప్రస్తుతం వర్షం ఊపరిపోసింది. వర్షం తీవ్రత వల్ల పల్నాడు,గుంటూరు జిల్లాల్లో పాఠశాలలకు మంగళవారం అధికారులు సెలవు ప్రకటించారు. గుంటూరులో ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల చలిగాలులు పెరిగాయి. రహదారులపై జనసంచారం తగ్గింది. చిరు వ్యాపారులకు ఇబ్బంది కలిగింది. వర్షంతో పలు ప్రాంతాల్లో మురుగునీరు ప్రధాన రహదారులపై ఏరులై పారింది.

➡️