మిడ్డేమీల్స్‌ కార్మికుల నిర్బంధంపై అంగన్వాడీల ఆగ్రహం

ఐటిడిఎ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు, మిడ్డేమీల్స్‌ కార్మికులు

ఐటిడిఎ ఎదుట ఆందోళన

ప్రజాశక్తి-రంపచోడవరం

విజయవాడలో మహాధర్నాకు బయలుదేరిన మధ్యాహ్నం భోజన పథకం కార్మికులను గురువారం రాత్రి పోలీసులు నిర్బంధించడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్డేమీల్స్‌ కార్మికులను నిర్బంధించడంపై శుక్రవారం మధ్యాహ్నం భోజనం కార్మికులు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా, పోలీసులు నిరాకరించారు. దీంతో వారికి మద్దతుగా అంగన్వాడీలు శుక్రవారం ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన స్థానిక ఐటిడిఎ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రోడ్డుపై మీద బైఠాయించి గంట పాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ రంపచోడవరంలోనే మధ్యాహ్నం భోజనం కార్మికులు వినతిపత్రం ఇవ్వడానికి కూడా అనుమతించకుండా నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో కార్మికుల ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సిరిమల్లిరెడ్డి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కె.మంగ. కలుముల లక్ష్మి, కె.బుల్లమ్మ, సిహెచ్‌.నవభారతి, సిహెచ్‌.సూర్యకాంతం, కె.అర్జమ్మ, మధ్యాహ్నం భోజనం యూనియన్‌ నాయకులు ఎమ్‌.రామలక్ష్మి. టి,కుమారి, యెస్‌.పద్మ, ఎమ్‌.బాపనమ్మ, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

➡️