మినీ రిజర్వాయర్‌ ఊసేలేదు

Apr 1,2024 21:24

ప్రజాశక్తి-వేపాడ : వీలుపర్తి రెవెన్యూ పరిధిలో మినీ రిజర్వాయర్‌ ఏర్పాటుపై గత, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం నిలువునా కమ్మేసింది. ఏళ్ల తరబడి మినీ రిజర్వాయర్‌ ఊసే లేకుండా పోయింది. రైతుల శ్రేయస్సు కోసం విశాఖ డెయిరీ రూ.6 కోట్ల నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చినా, పాలకుల అలసత్వంతో ఆ నిధులు అక్కరకు రాకుండా పోయాయి. దీంతో ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. వేపాడ మండలంలోని మారిక కొండల మీద నుంచి వచ్చే నీటిని ఒడిసిపడితే వేల ఎకరాల్లో రైతులకు సాగునీరు అందించవచ్చు. వేపాడ, లక్కవరపుకోట, శృంగవరపుకోట మండలాల్లోని ఐదు వేల ఎకరాలను సస్యశ్యామలం చేయొచ్చు. అందుకు వీలుపర్తి రెవెన్యూ పరిధిలోని బోడిమెట్ట, పందిమెట్ట మధ్య మినీ రిజర్వాయర్‌ చేయాలన్నది ఆలోచన. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంత రైతుల శ్రేయస్సు దృష్ట్యా అప్పటి విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు డెయిరీ నుంచి ఆరు కోట్లు నిధులు మంజూరుకు హామీనిచ్చారు. ఆ నిధులతో రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేస్తే మూడు మండలాల రైతులకు మేలు జరుగుతుందని తులసీరావు ముందుకొచ్చారు. అందుకు అప్పటి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కూడా చొరవచూపారు. మినీ రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల రైతులకు ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందని అప్పటి జిల్లా కలెక్టర్‌ ఎం.ఎం. నాయక్‌ పరిశీలన కూడా చేశారు. కలెక్టర్‌ కూడా మినీ రిజర్వాయర్‌ నిర్మాణానికి ఆమోదం కూడా తెలిపారు. ఇంతలో ఏమి జరిగిందో మినీ రిజర్వాయర్‌ పనులు మాత్రం ప్రారంభమే కాలేదు. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అనంతరం 2019లో వైసిపి అధికారంలోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మినీ రిజర్వాయరు ఊసే ఎత్తలేదు. సమావేశాల్లో మాత్రం తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అంటూ చెప్పుకోవడమే తప్ప ఐదు వేల మంది రైతులకు ఉపయోగపడే మినీ రిజర్వాయర్‌ గురించి పట్టించుకోలేదు.అందుకేనా వెనుకడుగు?మూడు మండలాల రైతుల భవిష్యత్తుతో ముడిపడిన ప్రాజెక్టుకు విశాఖ డెయిరీ నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కానీ రైతుల శ్రేయస్సు కన్నా ముందు నాటి టిడిపి, ప్రస్తుత వైసిపి పాలకులు స్వలాభం చూసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వీలుపర్తి రెవెన్యూ పరిధిలోని బోడిమెట్ట, పందిమెట్ట కొండల మధ్య మినీ రిజర్వాయర్‌ ఏర్పాటుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. సర్వే నంబరు 2, 33లో ఉన్న అదే కొండలను రిగ్‌ బ్లాస్టింగ్‌ చేస్తూ దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఆ క్వారీలు నిర్వహిస్తున్న యజమానులు.. స్థానిక ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యారు. దీనివల్ల గత, ప్రస్తుత స్థానిక ప్రజాప్రతి నిధులకు కాసుల పంట పండిందన్నది రైతుల ఆరోపణ. అందుకే మినీ రిజర్వాయర్‌ గురించి గత, ప్రస్తుత పాలకులు పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. క్వారీల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న రైతుల పంటలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. అయినా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రత్యేకంగా పరిశీలన చేస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావని పరిసర ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️