మిమ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Feb 20,2024 21:42

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని , మొండిగా వ్యవహరిస్తున్న మిమ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట మిమ్స్‌ ఉద్యోగులు చేపట్టిన 36 గంటల నిరసన ధర్నా మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ఎదుట రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టివి రమణ మాట్లాడుతూ స్వాతంత్య్ర రాకముందు నుంచి పెద్ద ఎత్తున పోరాడి కార్మిక చట్టాలను సాధించుకున్నారని తెలిపారు. అందులో సంఘం పెట్టుకునే హక్కు కూడా ఉందన్నారు. అందులో ఆఫీస్‌ బేరర్స్‌లో 50శాతం బయట వ్యక్తులు ఉండవచ్చునని, కానీ మిమ్స్‌ యాజమాన్యం దీన్ని ఖాతరు చేయకుండా కార్మిక హక్కులను హరిస్తూ ఉద్యోగులను కట్టు బానిసల్లాగా చేస్తూ దోచుకుంటుందని అన్నారు. ఈ నిర్ణయాలను వ్యతిరేకించిన ఉద్యోగులు యూనియన్‌ ద్వారా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోకుండా యాజమాన్య మాటలను, చర్యలను సమర్థిస్తున్నారన్నారు. జనవరిలో చేసిన విధులకు నేటివరకు జీతం ఇవ్వలేదన్నారు. నెలలో ఏడో తేదీ లోపు జీతం ఇవ్వకపోతే ఆ యాజమాన్యంపై జరిమానాతోపాటు కేసు నమోదు చేయవచ్చునని తెలిపారు. కానీ జిల్లా అధికారులు గాని, కార్మికశాఖ అధికారులు గాని చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికారులు కలుగజేసుకొని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, చర్చలు జరిపి ఉద్యోగులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బి.రమణ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌. హరీష్‌, మిమ్స్‌ ఉద్యోగులు ఎం.నారాయణ రావు, కామునాయుడు, మధు, రాంబాబు, నాగభూషణం, బంగారునాయుడు, మూర్తి, పైడిరాజు, స్వర్ణలత, గౌరీ, భవాని దేవి, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️