అతిసార నియంత్రణకు టాస్క్‌ ఫోర్స్‌

Jun 24,2024 21:46

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  జిల్లాలో అతిసార వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు పది ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో ఒక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ చెప్పారు. జూలై 1 నుంచి ఆగష్టు 31 వరకు రెండు నెలల పాటు ఈ వ్యాధిని నియంత్రించేందుకు టాస్క్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. జిల్లా స్థాయి అతిసార నియంత్రణ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్‌ కార్యాలయ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలు ఎవ్వరూ ఈ వ్యాధి బారిన పడి మరణించకుండా ఇంటింటికీ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, జింక్‌ ప్యాకెట్లు పంపిణీ, తాగునీటి వనరులు కలుషితం కాకుండా వాటిని తరచుగా క్లోరినేషన్‌ చేయించడం, స్కూల్‌ పిల్లల్లో భోజనానికి ముందు చేతులు శుభ్రపరచుకొనేలా చర్యలు చేపట్టడం, పరిసరాల పరిశుభ్రత చర్యలు చేపట్టడం వంటి చర్యల ద్వారా వచ్చే రెండు నెలల కాలంలో జిల్లాలో అతిసార మరణాలు సంభవించకుండా అప్రమత్తంగా వుండాలని జెసి ఆదేశించారు. డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ భాస్కరరావు మాట్లాడుతూ రెండు నెలలు పాటు జరిగే స్టాప్‌ డయేరియా కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మహిళాశిశు సంక్షేమశాఖ, గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్‌, విద్యాశాఖ, అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ప్రజారోగ్య ఇంజనీరింగ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ, ఆహరం, పౌరసరఫరాలు, పట్టణాభివృద్ధి తదితర శాఖలు భాగస్వామ్యం అవుతున్నట్టు చెప్పారు. జిల్లాలో 1.34 లక్షల మంది ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారులు వున్నట్టు చెప్పారు. ముఖ్యంగా మురికివాడలు, గిరిజన ప్రాంతాలు, మత్స్య కార నివాస గ్రామాల్లో యీ వ్యాధి ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ రోపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఆర్‌డిఒ సూర్యకళ, డిప్యూటీ కలెక్టర్‌లు మురళీ కృష్ణ, నూకరాజు, రాజేశ్వరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️