మిర్చికి పెరిగిన గిరాకి

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు మిర్చి యార్డులో రద్డీ కొనసాగుతోంది. వారం రోజులుగా యార్డుకు పెద్ద ఎత్తున సరుకు వస్తోంది. ధరలు కూడా గత వారం కంటే క్రమంగా పెరుగుతున్నాయి. రెండ్రోజుల్లో క్వింటాళ్‌కు సగటున రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు పెరిగినట్టు చెబుతున్నారు. కర్నూలు, ప్రకాశం, పల్నాడు, కృష్ణా, నంద్యాల జిల్లాల నుంచి ఎక్కువగా సరకు వస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి బుధవారం 1,32,165 టిక్కీలు రాగా పాత నిల్వలతో కలిపి 1,28,340 టిక్కీలు అమ్ముడుపోయాయి. 76,406 టిక్కీలు నిల్వ ఉన్నాయి. సోమవారం నుంచి నిత్యం లక్ష టిక్కీలకుపైగా వస్తున్నాయి. ఒకేసారి ఎక్కువ టిక్కీలు రావడంతో యార్డు ప్రాంగణమంతా ఎటుచూసినా మిర్చి టిక్కీలు కన్పిస్తున్నాయి. బుధవారం సాధారణ రకాలు ధర క్వింటాళ్‌ కనిష్ట ధర రూ.8,500, గరిష్ట ధర రూ.20,200 పలికింది. మేలు రకాల సరుకు కూడా ధరలు తక్కువగానే నమోదయ్యాయి. ప్రధానంగా తేజ, బాడిగ రకాలు కనిష్ట ధర రూ.8 వేలు, గరిష్ట ధర రూ.21 వేలు పలికాయి. కోల్డ్‌ స్టోరేజీ సరుకు రావడం బాగా తగ్గింది. యార్డుకు సరుకు ఎక్కువగా వస్తుండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. ప్రస్తుతం సరుకు నాణ్యత బాగుండటంతో ఎక్కువ మంది ఏ రోజు కారోజు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉండటం వల్ల రానున్న రెండునెలల్లో సరుకు తక్కువగా వస్తుందన్న భావనతో ఇతర ప్రాంతాల వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడం వల్ల మూడు కోతల్లో సరుకు తక్కువగా వస్తుందంటున్నారు. అయితే మార్చిలో పచ్చళ్ల సీజన్‌ ప్రారంభం అయితే మరింత డిమాండ్‌ ఉండవచ్చునని వ్యాపారులు భావిస్తున్నారు. ఇప్పుడు గరిష్ట ధర రూ.20 వేలు మాత్రమే ఉండటం వల్ల క్వింటాళ్‌ రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు రిటైల్‌లో అమ్ముకునే అవకాశం ఉండటంతో వ్యాపారులు తమ కొనుగోలు వేగం పెంచారు. కొంతమంది రైతుల నుంచి వ్యాపారులు ఆంక్షలు విధిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, ఆరబెట్టుకుని తీసుకురమ్మని షరతు విధిస్తున్నారు. యార్డులోనే ఖాళీ స్థలాల్లో ఆరబోసుకుని సాయంత్రం కల్లా గోతాల్లోకి ఎత్తుకోవడం కన్పించింది. ఎండిన కాయలకు ధరలు బాగా వస్తుండటంతో ఎక్కువ మంది తేమ శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యార్డులోనే రైతులు బస చేస్తున్నారు. ఒకటి రెండు రోజులు ఆరబెట్టుకుని యార్డులోనే నిద్రించి సరుకు అమ్మిన తరువాత ఇళ్లకు వెళ్తున్నారు.

➡️