మీడియా పై దాడులు అరికట్టాలి

Feb 21,2024 21:12

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మీడియాపై వైసిపి నాయకుల దాడులు అరికట్టాలని సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మీడియా ప్రతినిధులు, కార్యాలయాలపై వైసిపి చేస్తున్న దాడులను అరికట్టాలని కోరుతూ జరజాపుపేటలో గురువారం గాంధీ విగ్రహానికి నాయకులు వినతి పత్రం అందజేశారు. సిపిఎం నాయకులు కిల్లంపల్లి రామారావు, సిపిఐ నాయకులు మొయిద పాపారావు తదితరులు పాల్గొన్నారు.గజపతినగరం: గత రెండు రోజులుగా మీడియా పై జరుగుతున్న దాడులు హేయమని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్‌ కొండపల్లి అప్పలనాయుడు ఖండించారు. వాస్తవాలను మీడియా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించడాన్ని ఓర్వలేక వైసిపి నాయకులు మీడియా పై దాడి చేస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో అధికారంలోకి రాగానే మీడియా గొంతు నొక్కడనికి జగన్‌ రెడ్డి జీవో తీసుకొచ్చారని, ఇపుడు ప్రత్యక్ష దాడులకు దిగడం దారుణమని చెప్పారు. భోగాపురం: ఓటమి భయంతోనే జగన్‌ మీడియాపై దాడులు చేయిస్తున్నారని నెల్లిమర్ల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ కర్రోతు బంగార్రాజు అన్నారు. పోలిపల్లి గ్రామంలో ఆయన స్వగృహంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రశ్నించే గళం వింటే జగన్‌ రెడ్డికి ఒణుకు పుడుతోందన్నారు. అందుకే ఆయనకు ప్రజలు, ప్రతిపక్షపార్టీలు, మీడియా అంటే భయం పట్టుకుందన్నారు. ఆయన భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు మీడియాపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో పూసపాటిరేగ మాజీ ఎంనిటిపి మురపాల బోగేష్‌, నాయకులు కాకి బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.మెంటాడ: పత్రికావిలేకరులు, పత్రికా కార్యాలయాలపై దాడులతో జగన్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతునులిమే ప్రయత్నం చేస్తోందని నినాదాలు చేస్తూ మెంటాడ, గజపతినగరం మండలాల విలేకరులు బుధవారం ఎపిడబ్ల్యుజెఎఫ్‌ జర్నలిస్టు యూనియన్‌ కార్యవర్గ సభ్యులు కెంగువ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ చేసి అనంతరం స్థానిక ఉప తహశీల్దార్‌ వెంకట్రావుకు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో విలేకరులు చప్ప శివకేశవనాయుడు, కె ఈశ్వర రావు, ఎస్‌.నాగభూషణం, వెంకటరావు, సత్యనారాయణ, సత్యం, బుజ్జి, రామకృష్ణ, శంకరరావు, శ్రీను, పాల్గొన్నారు.దాడులపై కలెక్టర్‌కు జర్నలిస్టుల వినతి పత్రంవిజయనగరం కోట: రాప్తాడులో సిఎం సభను కవర్‌ చేయడానికి వెళ్లి ఆంద్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌ పైనా, కర్నూలు ఈనాడు కార్యాలయంపైనా వైసిపి మూకలు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్టులు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్‌ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. దాడులు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ఎటాక్‌ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి వెంటనే కమీషనర్‌తో మాట్లాడతానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

➡️