ముంచుకొస్తున్న మిచౌంగ్‌

Dec 4,2023 22:59
మిచౌంగ్‌

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు
నేడు పాఠశాలలకు సెలవు ప్రకటన
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
మిచౌంగ్‌ మప్పు ముంచుకొస్తోంది.. రైతులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే జిల్లాపై తన పంజాను విసిరింది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపివ్యకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఈదురుగాలులకు అరటి పంట నేలమట్టమైంది, వరిచేలు నేలకొరిగాయి. పలుచోట్ల కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. మంగళవారం మిచౌంగ్‌ తుపాను తీరం దాటనున్న సమయంలో మరింత ముప్పు ఉంటుందనే హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కళ్లాలో ఉన్న ధాన్యాన్ని హుటాహుటిన మిల్లులకు తరలించే పనిలో నిమగమయ్యారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులతో పాటు అధికార యంత్రాంగమూ అప్రమత్తమవుతోంది. రాజమహేంద్రవరంలో శ్యామలా సెంటర్‌, తుమ్మలావ, హైటెక్‌ బస్టాండ్‌ ప్రాంతాలు చెరువులను తలపించాయి. తుపాను నేపథ్యంలో ధాన్యం రాసులను కళ్లాల నుంచి తరలించడంతో రైతులకు కొంత ఊరట లభించింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం 16.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో అనపర్తిలో అత్యధికంగా 24.8 మిల్లీ మీటర్లు, నల్లజర్లలో అత్యల్పంగా 0.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అధికారుల అప్రమత్తంతుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కళ్ళాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. కలెక్టరు కె. మాధవీలత ఆదేశాలతో జాయింట్‌ కలెక్టరు తేజ్‌ భరత్‌, డిప్యూటీ తహశీల్దార్లు ఇతర అధికారులు బృందాలుగా ఏర్పడి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలుకు అనుమతి ఇవ్వటంతో కొంతమేర సత్ఫతాలు వచ్చాయి. పెరవలి మండలంలో అధిక వర్షం కురవటంతో కొన్ని గ్రామాల్లో పంట నేలవాలింది. దీంతో రైతులలో ఆందోళన నెలకొంది. పంట బోదెల ద్వారా వర్షపు నీటిని తరలించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. అవసరమైతే మోటార్లు ఏర్పాటు చేసైనా నిలిచిన నీటిని తరలించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు మాధవిలత ప్రకటనలో తెలిపారు. పౌరసరఫరాల శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్‌ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలకు అవసరమైన మందులను పిహెచ్‌సిలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దేవరపల్లి మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జనజీవనం స్తంభించింది. రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మండలంలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పెరవలిలో వర్షం, ఈదురుగాలులకు వరిచేలు, అరటి పంట నేలవాలింది. వరి పంట దిగుబడి ఆశాజనకంగా ఉందనుకునేసమయంలో తుపాను రైతులకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. పంటను ఒబ్బిడి చేసుకునేందుకు వారు నానా కష్టాలు పడుతున్నారు. చాగల్లు మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వర్షంతో చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. తుపాను హెచ్చరికలతో ప్రజలని అప్రమం చేశామని తహశీల్దార్‌ కె.రాజ్యలక్ష్మి తెలిపారు ఆరోగ్య సమస్యలు రాకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలని పిహెచ్‌సి వైద్యులు కె.లక్ష్మీప్రియ సూచించారు. తాళ్లపూడిలో రైతులు కోసిన ధాన్యాన్ని ఆఫ్‌ లైన్‌లో మిల్లులకు చేరవేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జెసి తేజ్‌ భరత్‌ పేర్కొన్నారు. తాళ్లపూడి మండలంలోని ఆర్‌బికెలను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను నేపథ్యంలో వరి కోతలను ఆపాలని రైతులకు సూచించారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నా ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించారు. కోసిన ధాన్యాన్ని ఆర్‌బికె ద్వారా రైతులకు నచ్చిన మిల్లుకు పంపించుకునేలా నిబంధనలు మార్చారని తెలిపారు. ధాన్యం మిల్లులకు పంపించడానికి సంబంధించిన అవసరమైన సంచులు తదితర అవసరాలను రైతులకు అందించాలని తహశీల్దార్‌ రాధిక, వ్యవసాయ శాఖ అధికారి రుచిత, సిబ్బందని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కమిషనర్‌ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌ ప్రజలకు సూచించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌, శానిటేషన్‌ అధికారులతో కలిసి ఆయన సోమవారం పర్యటించారు. హై టెక్‌ బస్టాండు, తుమ్మలావ, కృష్ణానగర్‌ తదితర ప్రదేశాల్లో యుద్ధప్రాతిపదికన పూడిక తీయాలని ఆదేశించారు. నల్లా ఛానల్‌, ఎన్‌ఆర్‌సిపి పంపింగ్‌ స్టేషన్లలో మోటర్లు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. అలాగే మంచినీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. నగరంలో కాలువ పనులు జరుగుతున్న చోట పాదచారులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేశామని, అత్యవసర సిబ్బంది వెంటనే విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యార్ధం నగరపాలక సంస్థ కార్యాలయములో 24 గంటలు పనిచేసేలా 9494060060 నెంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఇ జి.పాండురంగారావు, ఇఇ అలీ తదితరులున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాప్రజాశక్తి- గోకవరంతడిసిన ధాన్యం, తేమ శాతం రాని ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తంటికొండ గ్రామ వరి రైతులు సోమవారం గోకవరం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న మండల ప్రత్యేక అధికారి, డ్వామా పీడీ జగదాంబ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి మిల్లర్లకు పంపుతామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారమే కొనుగోలు చేస్తామన్నారు. వర్షం కారణంగా హమాలీలు రావడం లేదని రైతులు పీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్పందించి హమాలీలతో మాట్లాడతామన్నారు. ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లోనూ ధాన్యాన్ని కొనుగొలు చేస్తామన్నారు.దీంతో వారు ఆందోళన విరమించారు. ఆమె వెంట తహశీల్దార్‌ శ్రీనివాస్‌, ఎఒ రాజేశ్వరి తదితరులున్నారు.

➡️