ఫోన్‌లో కాదు.. గ్రౌండ్‌లో ఆడండి..

Jun 28,2024 23:36

క్రికెట్‌ టోర్నీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి
ప్రజాశక్తి – మాచర్ల :
సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల అసక్తిని చూపాలని యువతకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి సూచించారు. పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి బంగ్లా సమీపంలోని క్రీడా మైదానంలో టిడిపి మైనారిటీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌ ఆన్వర్‌బాషా ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి నాగిరెడ్డి మెమోరియల్‌ ఓపెన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత సెల్‌ఫోన్‌లలో వీడియో గేమ్‌లు, పబ్జి గేమ్స్‌ ఆడేందుకు అలవాటు పడుతున్నారని, ఇది మంచి పరిణామం కాదని అన్నారు. శరీరానికి ఫిజికల్‌ ఎక్సైర్‌సైజ్‌ ఎంతో అవసరమని, ఫోన్‌లో కాకుండా గ్రౌండ్‌లో ఆడాలని చెప్పారు. అసక్తి ఉన్న ఏదో ఒక ఆటను ఎంపిక చేసుకుని అందులో రాణించాలని సూచించారు. ఆటల నుండి టీమ్‌ స్పిరిట్‌ కూడ వస్తుందన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకోని బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆన్వర్‌బాషా మాట్లాడుతూ క్రీడల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.1,33,318, రెండోవ బహుమతిగా రూ.93,318, మూడవ బహుమతిగా రూ.63,318, 4వ బహుమతిగా రూ.33,318, ఇతర బహుమతులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి స్పాన్సర్‌ చేస్తారని వివరించారు. కార్యక్రమంలో జూలకంటి అక్కిరెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కె.దుర్గారావు, బి.శ్రీనివాసరావు, కె.అనిల్‌కుమార్‌, జి.శేషు, సిహెచ్‌.ఆంజనేయులు, నాగూర్‌ బాషా, ఒ.క్రాంతికుమార్‌, రామాటాకీస్‌ జాని, ఖాజా, కుమార్‌, మదీన్‌, లాలా, వినోద, శ్రీవాత్సవ్‌ పాల్గొన్నారు.

అన్నా క్యాంటీన్‌ నిర్వహణ అభినందనీయం
రాష్ట్ర ప్రభుత్వం నడిపే వరకు అన్నా క్యాంటీన్లలను ఆర్యవైశ్యులు కొనసాగించడం ఎంతో హర్షణీయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి అన్నారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్‌లో భోజన పంపిణీని ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంటీన్లను వైసిపి ప్రభుత్వం మూసేయించిందని, వాటిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. మాచర్ల పట్టణంలోని అన్నా క్యాంటీన్‌ ద్వారా ఉచితంగా అన్నదానం చేసేందుకు పట్టణ ఆర్యవైశ్య సంఘం పెద్దలు ముందుకు రావటం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు నడిచే వరకు ఆర్యవైశ్య సంఘం పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. తొలిరోజు అన్నదాత మారం ప్రసాదరావు అని చెప్పారు. పెళ్లి రోజులు గాని, పుట్టిన రోజు గాని తమ ఇంట్లో జరుపుకునే వేడుకల సందర్భంగా పది మందికి అన్నం పెట్టాలని ఆలోచన ఉంటే అన్నా క్యాంటీన్లలకు సహకారం అందించాలని కోరారు. ఆర్యవైశ్య సంఘ పెద్దలు మారం ప్రసాదరావు, సూరే యల్లమంద, కంభంపాటి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ పేదలకు అన్నదానం చేసే అవకాశం రావటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించే వరకు తాము కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డి.వెంకటదాసు, ఎఇ ఆదిత్య, సచివాలయ ఆడ్మిన్‌ శ్రీలక్ష్మీ, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కె.దుర్గారావు, బి.శ్రీనివాసరావు, ఎస్‌.వేణు, ఆర్యవైశ్య సంఘ పెద్దలు కె.వెంకటేశ్వర్లు, పి.సత్యనారాయణ, ఆర్‌.సత్యనారాయణ, కె.చంటి, వి.గోపాలక్రిష్ణమూర్తి, జి.శేషు, ఎం.చినవెంకటేశ్వర్లు, డి.వెంకటశేషు, ఎం.రాముడు, బి.లక్ష్మీచెన్నకేశవరావు, కె.సైదయ్య, ఎస్‌.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

➡️