ముందు కలవండి… ఆ తర్వాతే పిలవండి

Feb 23,2024 21:40

ప్రజాశక్తి – కురుపాం : టిడిపిలోని గ్రూపు రాకీయాల పట్ల జనసేన కార్యకర్తలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపి-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం కురుపాంలోని సాయిరాం గుడి ఎదురు మైదానం వద్ద శుక్రవారం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి, జనసేన ఇన్చార్జి కె.మల్లేష్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సమావేశం మధ్యలో జనసేన కార్యకర్తలు లేచి టిడిపిలోని రెండు గ్రూపులున్నాయని, ఈ సమావేశానికి ఒక గ్రూపు ఎందుకు డుమ్మా కొట్టిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో టిడిపి-జనసేన ఉమ్మడిగా అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతుంటే నియోజకవర్గంలో ఇందుకు విరుద్ధంగా ఏ కార్యక్రమం చేసినా జనసేన కార్యకర్తలకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మనం ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి గెలిపించుకోవాలి అంటే అంతా ఏకతాటిపై ఉండి ఉమ్మడిగా ఉండాలి కానీ టిడిపిలో ఉన్న రెండు గ్రూపులు కలవకుండా ఏ కార్యక్రమం చేసినా జనసేనను పిలవడం లేదని అన్నారు. కనీసం జిల్లా, మండల స్థాయి పదవుల్లో ఉన్న జనసేన నాయకులకు కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడంలో ఆంతర్మేమిటని ప్రశ్నించారు. అనంతరం జనసేన ఇన్చార్జి కె.మల్లేష్‌ కార్యకర్తలతో మాట్లాడి సమన్వయ పరచడానికి చూడగా, ఆయనపై కార్యకర్తలు ‘నువ్వు వెళ్తే ఒంటరిగా వెళ్లు, కానీ రెండు వర్గాలు కలిస్తేనే మేం పార్టీ కార్యక్రమంలో పాల్గొంటామని, అంతవరకు పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటామని జనసేన కార్యకర్తలు ఖరాఖండీ తేల్చి చెప్పారు. దీంతో రాబోయే రోజుల్లో కురుపాం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు జనసేన, టిడిపి ఏమేరకు కలిసి పనిచేస్తాయో వేచి చూడాల్సిందే. సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌చంద్రదేవ్‌, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ ఎస్టీ అధికార ప్రతినిధి ఎన్‌.కృష్ణబాబు, మండల కన్వీనర్లు, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️