ముగిసిన ఆశాల 36 గంటల నిరసన

Dec 15,2023 20:38

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద ఆశావర్కర్లు చేపట్టిన 36 గంటల నిరసన ధర్నా, వంటా వార్పు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలతో ముగిసింది. రెండు రోజులు పాటు విధులకు హాజరుకాకుండా ఆశా వర్కర్లంతా గురువారం నుంచి రాత్రి చలిలో వణుకుతూ నిరసనలో పాల్గొన్నారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. డిఎంఅండ్‌హెచ్‌ఒ భాస్కరరావు ధర్నా శిబిరం వద్దకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా వేధింపులు ఆపాలని, చనిపోయిన ఇద్దరు ఆశా వర్కర్ల పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని ,అదనపు పనులు నియంత్రించాలని, స్థానిక సమస్యలు పరిష్కారం కోసం మెడికల్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వంకనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, మొబైల్‌ వర్క్స్‌ శిక్షణ ఇవ్వాలని, రికార్డ్‌ లేదా ఆన్‌లైన్‌ ఏదైనా ఒకే పని చేయించాలని కోరారు. 10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ 5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవులు, వేతనంతో కూడిన మెటర్నటీ లీవులు అమలు చేయాలని, ఎఎన్‌ఎం, సచివాలయ హెల్త్‌ సెక్రటరీ నియమకాల్లో ఆశాలకు వెయిటేజి ఇవ్వాలని డిఎంహెచ్‌ఒ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో స్థానికంగా చెప్పిన సమస్యలు వారం రోజులులో పరిష్కారం చేస్తానని, చనిపోయిన ఇద్దరు ఆశా వర్కర్లు పిల్లలకు ఉద్యోగం వచ్చే విధంగాపై అధికారులు దృష్టిలో పెట్టీ పరిష్కరిస్తానని, మెడికల్‌ అధికారుల తో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. మిగతా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టిన ప్రాంతంలో వంట వార్పు చేసి బోజనాలు చేశారు కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎల్‌. శాంతమ్మ, ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి, జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

➡️