మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికులు సిఐటియులో చేరిక

Jan 29,2024 00:21

సభలో మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి-గుంటూరు :
గుంటూరు నగరపాలక సంస్థలో పని చేస్తున్న వాటర్‌వర్క్స్‌, వెహికల్‌ షెడ్‌ డ్రైవర్లు, ఇతర విభాగాలకు చెందిన ఇంజినీరింగ్‌ కార్మికులు దాదాపు 100 మంది సిఐటియు అనుబంధ మున్సిపల్‌ కార్మిక సంఘంలో చేరారు. ఈ సందర్భంగా పాతగుంటూరు సిఐటియు కార్యాలయంలో ది గుంటూరు జిల్లా మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్షులు రాచూరి వేణు అధ్యక్షతన జరిగిన సభలో ఏపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. సిఐటియు అనుబంధ మున్సిపల్‌ కార్మిక సంఘంలో కొత్తగా చేసిన కార్మికులకు స్వాగతం పలికి, అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు అనుబంధ మున్సిపల్‌ కార్మిక సంఘం నిర్విరామ కృషి చేస్తోందని అన్నారు. ఇటీవల జరిగిన 16 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం, మంత్రులు ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలు చర్చ కూడా చేయకపోతే పట్టుబట్టి ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలపై చర్చించేట్లు చేసి, వారి జీతభత్యాలు నిర్ణయించేందుకు 9 మంది ఐఎఎస్‌లు, ఇతర అధికారులతో కమిటీ వేసేలా కృషి చేశామని వివరించారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు అనుబంధ మున్సిపల్‌ కార్మిక సంఘం పోరాడుతోందని తెలిపారు. మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సిఐటియు పోరాటం చేస్తుందని అన్నారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.ఎస్‌.చెంగయ్య, ఇంజనీరింగ్‌ విభాగం కన్వీనర్‌ పూనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు భూషమ్మ, వెంగమ్మ, కోటయ్య, గుంటూరు నగరపాలక సంస్థ వెహికల్‌ షెడ్‌ కమిటీ కన్వీనర్‌ వై.ప్రభుదాసు, వాటర్‌ వర్క్స్‌ విభాగం నాయకులు ఎస్‌.నాగేశ్వరరావు, వై.బాల, సురేష్‌, డ్రైవర్లు కె.మరియదాసు, ఎస్‌.శ్రీబాలప్రసాద్‌, బాలశౌరిరెడ్డి, జి శ్రీనివాసరావు, జశ్వంత్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

➡️