మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ ప్రదర్శన

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌ : సమ్మెలో భాగంగా మున్సిపల్‌ కార్మికులు అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలు నగరపాలక సంస్ధ కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకూ ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జివి.కొండారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం మొండి పట్టు వీడాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తంబి శ్రీనివాసులు, ఎస్‌డి. హుస్సేన్‌, యూనియన్‌ నాయకులు తేళ్ల విజయ, వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, రంపతోటి శ్రీను, శ్రీలక్ష్మి, కొర్నెపాటి రవి తదితరులు పాల్గొన్నారు. కనిగిరి : సమ్మెలో భాగంగా మున్సిపల్‌ మున్సిపల్‌ కార్మికులు పొర్లు దండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిసి. కేశవరావు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేసి అప్కాస్‌ నుంచి మినహాయించాలని కోరారు. మున్సిపల్‌ కార్మికుల పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎస్‌కె. ఖాదర్‌ వలీ, చార్లెస్‌, మార్క్‌ ,గరటయ్య, దస్తగిరి,రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం రూరల్‌ : సమ్మెలో భాగంగా మున్సిపల్‌ కార్మికులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పి.రూబెన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని ఎద్దేవ చేశారు. పేదల పక్షపాతినంటూ చెప్పుకునే ముఖ్యమంత్రికి మున్సిపల్‌ కార్మికులు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించిన మున్సిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కె. సుబ్బారాయుడు, ప్రధాన కార్యదర్శి గొట్టమొరి కృష్ణ, రమణ, చెన్నకేశవులు, షేక్‌ రషీద్‌ బాషా, తప్పట్ల శేషులు, జార్జీ తదితరులు పాల్గొన్నారు.

➡️