మున్సిపల్‌ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ

Jan 11,2024 21:22

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా సమ్మెను విరమించామని, అయితే వేతనాలు, హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎ.జగన్మోహన్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. ఈసందర్భంగా జగన్మోహన్‌ మాట్లాడుతూ 16 రోజులుగా సమ్మెలో పాల్గొన్న కార్మికులకు అభినందనలు తెలిపారు. పారిశుధ్య కార్మికులకు జీతం, హెల్త్‌ అలవెన్స్‌ కలిపి రూ. 21వేలు బేసిక్‌ వేతనం, డ్రైవర్లకు రూ.18500 జీతంతో ఆక్యుపెన్నీ హెల్త్‌ అలవెన్స్‌ రూ.6వేలు అమలు చేస్తారని తెలిపారు. సమ్మె కాలపు జీతం, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.50వేలు, పదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి రూ.2వేలు అదనపు చెల్లింపు, ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల నుంచి ఏడు లక్షలకు పరిహారం పెంపు, ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తామని చర్చల సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అయితే స్థానిక సమస్యలపై ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే సురేష్‌, నగర కార్యదర్శి బి రమణతో కలిసి అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాదరావుకు, మున్సిపల్‌ ఇఇకి బకాయి జీతాలు ,హెల్త్‌ అలవెన్స్లు చెల్లించాలని, యూనిఫామ్‌ కుట్టుకూలి ఇవ్వాలని, పనిముట్లు ,రక్షణ పరికరాలు ఇవ్వాలని వినతి అందజేశారు. బకాయి జీతాల కోసం శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని ప్రకటించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మురళి, నారాయణరావు, రాఘవ ,సూరి, లక్ష్మి, వరలక్ష్మి, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️