మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి-రేపల్లె: మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ సమస్యలు పరిష్కరిం చాలని, కనీస వేతనాలు అమలుచేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సీఐటీయూ రాష్ట ప్రధాన కార్యదర్శి కె ఉమమహేశ్వరరావు అన్నారు. బుధవారం రేపల్లె సీఐటీయూ కార్యాలయంలో రేపల్లె మున్సిపాలిటీ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రేపల్లె మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు డి ప్రభాకరరావు అధ్యక్షత వహించగా, మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట ప్రధాన కార్యదర్శి కె ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కార్మికులు అనేక సంవత్సరాల తరబడి పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం సరైన వేతనాలు అమలు చేయకపోవటం వల్ల నష్టపోతున్నారని అన్నారు. ఇంజనీరింగ్‌ కార్మికులను స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ కేటగిరిలుగా రూ.24,000 వేతనం చెల్లించాలని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని అన్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్లు, పార్కుల్లో పనిచేసే వాళ్ళకి, విద్యుత్తు, మంచినీళ్లు విభాగంలో పనిచేస్తున్న స్కిల్డ్‌ వర్కర్లు అందరికీ కూడా స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ వేతనాలు అమలు చేయాలని కోరారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని రాష్ట్రంలో కొన్నిచోట్ల ఒత్తిడి చేయటం వల్ల నిరంతరం భయాందోళనలో వర్కర్స్‌ ఉంటున్నారన్నారు. కాబట్టి అర్హులైన అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో రేపల్లె ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు సిహెచ్‌ మణిలాల్‌, అధ్యక్షుడు డి ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్‌ రవిబాబు, కోశాధికారి కె రాఘవేంద్రరావు ఇతర వర్కర్లు బి యువరాజు, వి శ్రీనివాసరావు, ఏ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

➡️