మాయా మిర్చిందా!

Jun 20,2024 22:51

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మిర్చి మార్కెట్‌లో ఈ ఏడాది విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గడం సహజం. ఉత్పత్తి గణనీయంగా తగ్గినా ధరలు తగ్గడంతో రైతులు అయోమయంలో చిక్కుకున్నారు. గుంటూరు మిర్చి ధరలు కొన్ని రోజుల నుండి క్రమంగా తగ్గుతుండగా గురువారం ఈ ధరలు మరింత తగ్గాయి. ధరలు పడిపోవడంతో రైతులకు నిరాశ ఎదురైంది. ఎగుమతులు లేకపోవడం, ప్రస్తుతం యార్డుకు వస్తున్న సరుకు చివరి కోతలకు సంబంధించిందని, నాణ్యత తక్కువగా ఉందని వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. గతేడాది ఇదే సమయంలో సగటు ధర క్వింటాళ్‌కు రూ.25 వేల నుంచి రూ.26 వేల వరకు ఉండగా ఈ ఏడాది రూ.20 వేలకు మించి ధర రావడం లేదని రైతులు వాపోయారు. అయితే గతేడాది 5.29 లక్షల క్వింటాళ్ల సరుకు యార్డుకు రాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 2.63 లక్షల క్వింటాళ్లు మాత్రమే సరుకు వచ్చింది. ఉత్పత్తి దాదాపు 50 శాతం తగ్గింది. కానీ ధర పెరగకపోగా తగ్గింది. డిమాండ్‌, సప్లరు సూత్రంలో తక్కువ సరుకు వచ్చినప్పుడు ఎక్కువ ధర రావాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఈ ఏడాది ధరలు పతనమయ్యాయి. కేవలం ఎగుమతులకు ఆర్డర్లు లేవనే సాకుతో ధరలు తగ్గించారని రైతులు విమర్శిస్తున్నారు. 2021-22లో కనిష్ట ధర రూ.7వేలు, గరిష్టధర రూ.15 వేలు పలికింది. 2022-23లో కనిష్ట ధర రూ.7 వేలు, గరిష్ట ధర రూ.23 వేలు, 2023-24లో కనిష్ట ధర రూ.9 వేలు, గరిష్టధర రూ.26,500 పలకగా ఈ ఏడాది కనిష్టం రూ.7,500, సగటు గరిష్ట ధర రూ.20 వేలకు తగ్గింది. గతేడాది మేలో క్వింటాళ్‌ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 పలికాయి. బాడిగ మంచి రకానికి గతంలో రూ.35 వేల వరకు ధర పలకగా గురువారం సగటు ధర రూ.16,500 మాత్రమే వచ్చింది. మిగిలిన అన్నిరకాల మిర్చి ధరలు గణనీయంగా తగ్గాయి. ధరలు తగ్గడంతో రైతులు, వ్యాపారులు ఎక్కువగా కోల్డ్‌ స్టోరేజీల్లో మిర్చీ నిల్వలు చేస్తున్నారు. రైతులు కూడా ఎక్కువ చేసుకోలేక అయినకాడికి అమ్ముకునేందుకు సిద్ధపడటం వల్ల ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 75 లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉంచినట్టు అంచనా. ప్రధానంగా శ్రీలంక, మలేసియా, థారులాండ్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, నైజీరియా, సింగపూర్‌, స్వీడన్‌ తదితర దేశాలకు ఎగుమతులు ఎక్కువగా జరగుతుంటాయి. ఈ ఏడాది రాష్ట్రంలో మిర్చి ఉత్పత్తి తగ్గినా 2023-24 సీజన్‌లో ఇతర రాష్ట్రాల్లో విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగాయని, అందువల్ల ఆశించిన స్థాయిలో ఎగుమతి ఆర్డర్లు రాలేదని, అందుకే ధర తగ్గుతోందని వ్యాపారి సురేష్‌రెడ్డి చెప్పారు. స్థానికంగా మిర్చికి డిమాండ్‌ తగ్గిందని తెలిపారు. పచ్చళ్ల సీజన్‌, శుభకార్యాక్రమాలు లేకపోవడం వల్ల వినియోగం తగ్గడం వల్ల ధరలు తగ్గడానికి కారణమన్నారు.

➡️