మూట్‌ కోర్టు పోటీల్లో న్యాయ విద్యార్థుల ప్రతిభ

విద్యార్థులను అభినందిస్తున్న విసి సూర్యప్రకాశరావు

ప్రజాశక్తి-సబ్బవరం

మేఘాలయ నేషనల్‌ లా యూనివర్సిటీ, ఎన్‌హెచ్‌ఆర్‌సి వారు ఈ నెల 15 నుండి 18వ తేదీ వరకు నిర్వహించిన మూట్‌ కోర్టు పోటీల్లో స్థానిక దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ విద్యార్థులు ఉత్తమ న్యాయ నైపుణ్యాన్ని కనబరిచి అత్యుత్తమ ర్యాంక్‌లు సాధించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ డి.సూర్యప్రకాశరావు తెలిపారు. గురువారం ఆయన ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ తమ వర్సిటీ మొదటి సంవత్సరం విద్యార్థులు అథర్వ్‌ అర్నవ్‌, కౌశిక్‌ శర్మ, అభ్యుదరు మిశ్రాలతో కూడిన జట్టు న్యాయ రంగంలో అసాధారణమైన నైపుణ్యం, పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ప్రాథమిక రౌండ్‌లలో అత్యున్నత ర్యాంక్‌ పొందిన జట్టుగా నిలిచిందని తెలిపారు. తమ విద్యార్థులు వారి వాగ్ధాటి, ఒప్పించే వాదనలతో ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను ఆకర్షించి అధర్వ్‌ అర్నవ్‌ ఉత్తమ వక్తగా నిలవగా, కౌశిక్‌ శర్మ రెండవ ఉత్తమ వక్తగా నిలిచారని పేర్కొన్నారు. అభ్యుదరు మిశ్రా చేసిన పరిశోధనకు మొదటి బహుమతి లభించిందన్నారు. పిటిషనర్‌ పక్షం నుండి దాఖలు చేసిన మెమోరియల్‌కు మొదటి బహుమతి లభించిందన్నారు.

➡️