మూడో రోజూ క్వారీ పనులు నిలిపివేత

Mar 27,2024 21:04

  ప్రజాశక్తి- భోగాపురం : మండలంలోని రామచంద్ర పేట క్వారీ పనులు రెండు రోజుల నుంచి గ్రామస్తులు నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. మూడో రోజు బుధవారం కూడా క్వారీ పనులు గ్రామస్తులంతా కలిపి అడ్డుకున్నారు. నిర్వాహకుడు అనిల్‌ ఎట్టకేలకు క్వారీ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు దుక్క అప్పన్న, రవణ, సుగ్గు రాము, కోలా రామసూరి తదితరులు క్వారీ వ్యవహారంపై ప్రశ్నించారు. దీనిపై అనిల్‌ మాట్లాడుతూ తాను మీతో మాట్లాడడానికి రాలేదని, ఏదైనా ఉంటే గ్రామస్తులతో మాట్లాడుతానని సమాధానం ఇచ్చాడు. ఆయన మాటలపై గ్రామస్తులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీలో ఇష్టానుసారంగా బాంబు పేలుళ్లు నిర్వహిస్తుంటే గ్రామంలో ఎలా ఉండాలని ప్రశ్నించారు. 200 అడుగుల లోతుల్లో డ్రిల్లింగ్‌ చేసి బాంబులు పేలుస్తుండడంతో గ్రామంలోని ఇళ్ల పునాదులు కదిలిపోతున్నాయని అన్నారు. తాగునీరు కలుషితమై కిడ్నీలు పాడై చనిపోతున్నారని అన్నారు. దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. క్వారీ అనుమతులు పొందిన యజమాని రామరాజు ను పిలిపించాలని దుక్క అప్పన్న అన్నారు. నిర్మాణం పూర్తయిన సచివాలయం ప్రారంభోత్సవానికి నోచుకోకుండా కోర్టుకు వెళ్లి నిలిపివేసిన ఆయన రావాలని డిమాండ్‌ చేశారు. నిర్వాహకుడు అనిల్‌ ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుండడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పనులు అడ్డుకొని తీరుతామని గ్రామస్తులు హెచ్చరించారు.

➡️