మెగా డిఎస్‌సిని వెంటనే ప్రకటించాలి : డివైఎఫ్‌ఐ

Jan 25,2024 20:15

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : మెగా డిఎస్‌సి వెంటనే ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో గురువారం నిరుద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం నుంచి కోటజంక్షన్‌ వరకు భారీ ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ మానవహారం చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ తక్షణం విడుదల చేయాలని, జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ హరీష్‌ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు నిరుద్యోగులకు జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్లు విడుదల చేస్తానని, ప్రతి ఏటా ఖాళీ అయ్యే ఉద్యోగాలతో కలిపి ప్రతి జనవరికి జాబ్‌ క్యాలెండర్లు విడుదల చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. 2018 డిఎస్‌సి తర్వాత ఇప్పటివరకు ఒక్క డిఎస్‌సి కూడా విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పేరుతో పనులు చేసి విద్యార్థుల సంఖ్యను పెంచామని గొప్పలు చెప్పుకునే జగన్మోహన్‌ రెడ్డికి ఆ విద్యార్థులకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఆలోచన లేకపోవడం ఘోరమని అన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి 50వేల పోస్టులు ఖాళీలున్నాయని పార్లమెంట్‌లో ప్రకటిస్తే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరోజు 714 అని, మరో రోజు ఎనిమిది వేలు అని ఇంకొక రోజు 69అని నోటికి వచ్చినట్లు చెప్పడం నిరుద్యోగులను హేళన చేయడమేనని అన్నారు. బిఇడి, టిటిసి చదువుకొని రాష్ట్రంలో పది లక్షల మంది పైబడి కోచింగ్‌ సెంటర్లు స్టడీ హాల్స్‌ లో మగ్గిపోతున్నారని, వీరి బాధలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. తక్షణమే 25 వేల పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని , మూత పడిన ప్రభుత్వ పరిశ్రమలను తెరిపించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, లేనిపక్షంలో జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈనెల 27 28 తేదీలలో విజయవాడ కేంద్రంలో రెండు రోజులపాటు జరుగు నిరాహార దీక్షలో నిరుద్యోగులంతా పాల్గొని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు సతీష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.రామ్మోహన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

➡️