మెడకు ఉరితాళ్లతో నిరసన

ప్రజాశక్తి-కడప అర్బన్‌ అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 30 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే వారి సమస్యను పరిష్కరించాల్సింది పోయి, అధికార బలంతో అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తారా అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి పోరాడుతున్న అంగన్వాడీలపై జిఒ నంబర్‌ 2 ఎస్మా ప్రయోగించిన తీరుచూస్తుంటే ఉద్యమానికి ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థమవుతుందన్నారు. గతంలో ఉద్యోగుల, కార్మికుల పోరాటాలపై ఎస్మాను ప్రయోగించిన ముఖ్యమం త్రులందరూ అధికారాన్ని కోల్పోయారని, జగన్‌ కూడా ఆ జాబితాలో చేరేందుకు సిద్ధపడాలని హెచ్చరించారు. ఏ ఒక్క అంగన్వాడీ కూడా ప్రభుత్వ బెదిరింపులకు భయపడదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఓబులేసు, అంగన్వాడి యూనియన్‌ నాయకులు అంజనీ దేవి, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. జమ్మలమడుగు : ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెను అణచివేసేందుకు నోటీసులు ఇచ్చి సమ్మెను ఆపాలని ప్రయత్నం చేస్తుందని, తాము నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపేది లేదని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అంగన్వాడీ యూనియన్‌ నాయకులు భాగ్యమ్మ, లక్ష్మీదేవి పేర్కొన్నారు. జమ్మలమడుగు పట్టణంలో అంగన్వాడీలు ఉరి వేసుకుని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో జమ్మలమడుగు సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు, సిపిఎం పట్టణ కార్యదర్శి ఎసుదాసు, డివైఎఫ్‌ఐ బాధ్యులు వినరు కుమార్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్‌, కులాయమ్మ, అంగన్వాడీలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌): తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీల సమ్మె 30 రోజుల సందర్భంగా 30 ఆకారంగా కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ 30 రోజుల నుంచి అంగన్వాడీలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా ఎస్మా చట్టం తీసుకురావడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి శిబిరం వద్దకు వచ్చి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఇంత మంది మహిళలు రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే నెలరోజుల నుంచి వారి సమస్యల పరిష్కరించడానికి ఓపిక లేదా అని విమర్శించారు. ఆందోళనలో అంగన్వాడీ యూనియన్‌ లీడర్‌ రాజీ, అధ్యక్షులు రాణి, నిర్మల, లక్ష్మీదేవి, శివమ్మ, అర్బన్‌ సెంటర్‌ లీడర్లు పాల్గొన్నారు. వేంపల్లె: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరహర దీక్షలు చేసి రోడ్డుపైనే కూర్చుని భోజనాలు చేశారు. అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. జీతాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వేంపల్లె, వేముల, చక్రాయపేట మండలాలలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️