మైలవరానికి మరమ్మతులేవీ

మైలవరం రిజర్వాయర్‌ మరమ్మతులకు నిరీక్షణ తప్పడం లేదు. 2022 ఆగస్టులో జిల్లా నీటిపారుదల శాఖ రూ.80 కోట్లతో ప్రతిపాదనలు అందజేసింది. రాష్ట్ర ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగం రిమార్క్స్‌ పేరిట వెనక్కి పంపించింది. జిల్లా నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్‌ యంత్రాంగం రిమార్క్స్‌ను పరిశీలించి మళ్లీ ప్రతిపాదనల్ని పంపించింది. అయి నప్పటికీ సుమారు ఏడాదిన్నరగా పాలనామోదానికి నిరీక్షించాల్సి వస్తోంది. పాలనా మోదం అనంతరం సాంకేతిక అనుమతులు, టెండర్లు, అగ్రిమెంట్ల వ్యవహారం పూర్తి చేసే సమయానికి పుణ్యకాలం ముగియనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో మైలవరం మరమ్మతులు ఇప్పట్లో లేవనే ఇంజినీరింగ్‌ వర్గాలు పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లాలోని భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో మైలవరం ప్రధానమైంది. ఇటువంటి ప్రాధాన్యత ప్రాజెక్టు రెండేళ్ల కిందట కురిసిన భారీ వర్షాల ధాటికి మరమ్మతులకు గురైంది. రాయలసీమకే తలమానికమైన గండి కోట రిజర్వాయర్‌కు అనుసంధానమై ఉంది. 9.99 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో కూడిన 74 వేల ఎకరాల ఆయకట్టును కలిగి ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు మరమ్మతులకు రూ.80 కోట్లతో కూడిన ప్రతిపానదలు ఏడాదిగా ఆమోదానికి నోచుకోవడం లేదు. గతేడాది కురిసిన భారీ వర్గాల కారణంగా మైలవరం రిజర్వాయర్‌ రివిట్‌మెంట్‌ దెబ్బతింది. రిజర్వాయర్‌ బ్యూటిఫికేషన్‌ నిమిత్తం పంపించిన ప్రతిపాదనలకు రిమార్క్స్‌ పేరిట పాలనా యంత్రాంగం వెనక్కి పంపించింది. జిల్లా నీటి పారుదల శాఖ రిమార్క్స్‌ను సవరించించిన ప్రతిపాదనల్ని మళ్లీ పంపించింది. నెలల తరబడి ఎటువంటి కదలిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరమ్మతులకు మోక్షం లేనట్లే!మైలవరం రిజర్వాయర్‌కు రివిట్‌మెంట్‌ దగ్గర నుంచి గెస్ట్‌హౌస్‌, గోడలు, గేట్లు, కట్ట, లెఫ్ట్‌ బ్లాంక్‌, ప్రొటెక్షన్‌వాల్‌, ఫ్లడ్‌గేట్‌, లైటినింగ్‌, రహదారి, గేట్లు, ఉత్తర, దక్షిణ కాల్వలు మొదలగు నిర్మాణ పనులు దెబ్బతిని శిథిలావస్థకు చేరువలో ఉన్నాయి. గతేడాది లెఫ్ట్‌ కెనాల్‌లో పెరిగిన కంప చెట్లు, ఈదర మొక్కలను తొలగించారు. మళ్లీ యథాతథ పరిస్థితులు నెల కొనడంతో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ స్పందించి జిల్లా నీటి పారుదలశాఖ సహకారంతో రూ.80 కోట్లతో ప్రతిపాదనలను అందజేశారు. ఆమేరకు పాలనాపరమైన ఆమోదం లభించినట్లేనని భావించింది. ఎస్‌సిఎల్‌టి విభాగానికి ఫైలు చేరుకున్నట్లు సమాచారం. ఏడాదిన్నరగా కోల్డ్‌స్టోరేజీలోనే గతేడాది ఆగస్టు నుంచి అడ్మినిస్ట్రేషన్‌, టెక్నికల్‌ అనుమతుల కోసం నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్‌ యంత్రాంగం రిమార్క్స్‌ పేరిట అనుమతులు ఇవ్వడంలో కాలయాపన చేస్తోంది. ముఖ్యమంత్రి జిల్లాకు చెందిన భారీ ప్రాజెక్టు పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన మధ్య తరహా, చిన్నతరహా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. రాబోయే వేసవి సీజన్‌లో మరమ్మతులకు అవసరమైన వాతావరణం ఏర్పడింది. వేసవి సీజన్‌లో మరమ్మతులు చేసి వర్షాకాలం నాటికి సిద్ధం చేసుకునేందుకు అవకాశం ఉంది. లేనిపక్షంలో ఆగష్టు, అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో వరదలు వస్తే మైలవరం ప్రాజెక్టు పరిస్థి తేమిటో తెలియడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పందించి మైలవరం సాగునీటి ప్రాజెక్టు మరమ్మతుల పనుల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు. దీనిపై బాధ్య ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను సంప్రదించగా ప్రతిపాదనలు ఆమోదం లభించిన వెంటనే పనులు చేపడతామని పేర్కొనడం గమనార్హం.

➡️