ప్రొద్దుటూరులో దారుణ హత్య

ఆస్తికోసమే హత్య చేసినట్లు పలు అనుమానాలు
ప్రజాశక్తి-ప్రొద్దుటూరుప్రొద్దుటూరు
వైఎంఆర్‌ కాలనీలో ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుఝామున మధ్య వెంకట మహేశ్వరరెడ్డి(23) దారుణ హత్యకు గురయ్యాడు. భూమిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహేశ్వరరెడ్డి తల్లి నాగరత్నమ్మ రామచంద్రారెడ్డి 20 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. నాగరత్నమ్మకు తాళి కట్టిన భర్త ఏమయ్యాడనేది ఎవ్వరికీ తెలియదు. నాగరత్నమ్మ, రాంచంద్రారెడ్డి, హతుడు మహేశ్వరరెడ్డి ఒకే ఇంట్లో కాపురం ఉంటూ స్వీట్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. డబ్బుల కోసమని ఆదివారం రాత్రి రామచంద్రారెడ్డికి మహేశ్వరరెడ్డి మధ్య గొడవ జరిగినట్లు నాగరత్నమ్మ తెలిపారు. ఆమె ఉబకాయంతో ఇబ్బంది పడుతుండడం వల్ల రోజూ మందులు వాడుతున్నానని ఈ మందుల వల్ల తనకు మత్తుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కారణంగా రాత్రి తన గదిలోనికి వెళ్లి పడుకున్నానని నాగరత్నమ్మ తెలిపారు. తెల్లవారి చూసేటప్పటికీ ఇళ్లంతా రక్తమయంగా ఉందని రామచంద్రారెడ్డి ఒక గోనె సంచిలో ఏదో తీసుకెళ్తూ కనిపించగా ఏంటని అడగ్గా పాతసామాన్ల మూట అని బదులిచ్చాడని తెలిపారు. అనంతరం తాను ఇంటిలోపలికెళ్లి చూడగా హత్య జరిగిన విషయం బయటపడిందని తెలిపారు. మహేశ్వరరెడ్డి శరీరాన్ని రెండు, మూడు ముక్కలుగా చేసి ప్రొద్దుటూరు శివారు ప్రాంతంలో వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నామని డిఎస్‌పి మురళీధర్‌ తెలిపారు.

➡️