మొక్కుబడిగా మండల సమావేశం

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. ఈ సమావేశంలో గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు అవకాశ మున్నా తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పోరెడ్డి అరుణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. 21 మంది సర్పంచులకు గాను, ఆరుగురు సమావేశానికి హాజరుకాగా 15 మంది గైర్హాజరయ్యారు. 14 మంది ఎంపీటీసీలకుగాను, 8 మంది హాజరుకాగా, ఆరుగురు గైర్హాజరయ్యారు. పలు శాఖల అధికారులు సైతం గైర్హాజరయ్యారు. పలుశాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సభ్యులు ఎవరూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకు రాలేదు. దీంతో సమావేశం గంటన్నరలో ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీపీ పోరెడ్డి అరుణ మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మండల వ్యాప్తంగా నీటి ఎద్దడిని అరికట్టేందుకు ప్రత్యేక కార్యచరణ తయారు చేయాలని గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్య క్రమంలో జడ్పిటిసి సభ్యులు నారు బాపన్‌రెడ్డి, ఎంపీడీవో తోట చందన, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నల్లబోతుల కొండయ్య, కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ మొహమ్మద్‌ రఫీ, ఏపీఓ బి జీవరత్నం, ఏవో దేవిరెడ్డి శ్రీనివాసులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️