మోకాళ్లపై నిల్చొని నిరసన

Dec 27,2023 21:29

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: మున్సిపల్‌ కార్మికుల సమ్మె బుధవారం 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విజయనగరం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిల్చొని మున్సిపల్‌ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. జగన్మోహన్‌ రావు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు జగనన్న చేసిన నమ్మకద్రోహన్ని ఖండిస్తూ మోకాళ్ళపై నిల్చుని నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మున్సిపల్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి రవణమ్మ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బి. రమణ, నాయకులు రమా కుమారి, ఈశ్వరమ్మ, గౌరీ, శంకర్రావు, సూర్యనారాయణ, వంశీ, మురళి, తదితరులు పాల్గొన్నారు.రాజాం : అంబేద్కర్‌ విగ్రహం వద్ద మోకాళ్లపై నిల్చొని మున్సిపల్‌ కార్మికులు నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరారు. యూనియన్‌ నాయకులు శ్రీనివాసరావు, అనిల్‌ కుమార్‌, లక్ష్మి, గురువులు, రాంబాబు, వెంకటి, గోపి, రాజేష్‌, కనకరాజు పాల్గొన్నారు.బొబ్బిలి : మున్సిపల్‌ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకర్రావు మాట్లాడారు. నెల్లిమర్ల: ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కమిటి సభ్యులు కిల్లంపల్లి రామారావు డిమాండ్‌ చేశారు. బుదవారం సిఐటి యు అనుబంధ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్మికుల చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మోకాళ్ళ పై నిరసన తెలిపారు. కిల్లంపల్లి రామారావు మాట్లాడుతూ కార్మి కులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, రిటర్మెంట్‌ బెనిఫిట్స్‌ 5 లక్షలు, ఇంజనీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ ఆలవెన్స్‌, డ్రైవర్లకు ఆక్యు పెన్ష్‌ అలవేన్స్‌ ఇవ్వాలని కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు టి. బాబురావు, బి.హరిబాబు, జె. శ్రీను, బి. రాము, టి. లక్ష్మీ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️