మోసపోయం.. ఆదుకోండి

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు చేసి పరారైన టి.నరసింహపై కేసు పెట్టి, బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం, జనసేన పార్టీలు డిమాండ్‌ చేశాయి. సోమవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయం వద్ద నరసింహ చేతిలో మోసపోయిన నిరుద్యోగులు చేపట్టిన ధర్నాకు జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల దీనస్థితికి నరసింహ చేతిలో మోసపోయిన నిరుద్యోగులే ఉదాహరణ అని అన్నారు. ఏలూరుకు చెందిన నరసింహ తన కుమార్తె, బావమరిదితో కలిసి బోగస్‌ కంపెని పెట్టాడన్నారు. ఆ పేరుతో ఐసిడిఎస్‌ సంస్థలో అంగన్‌వాడీ కార్యకర్తలు నుంచి సూపర్‌వైజర్లు, కో ఆర్డినేటర్ల, తదితర ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికి, సుమారు 200 మంది వద్ద నుండి రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలు వసూలు చేశారన్నారు. డబ్బు చెల్లించిన నిరుద్యోగులు నెలలు గడుస్తున్నప్పటికీ తమకు ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారని ఒత్తిడి చేయడంతో నరసింహ పరారయ్యాడని తెలిపారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా జాబ్‌ క్యాలెండర్‌ తీస్తామని ఎన్నికల ముందు ప్రకటించిందని, కానీ దాన్ని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. బాధితు లకు డబ్బులు తిరిగి చెల్లించేలా స్థానిక ఎంఎల్‌ఎ, ప్రభు త్వం, జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్‌, నిరుద్యోగుల పోరాట నాయకులు కుమార్‌, బహుజన సేన నాయకులు మత్తే బాబీ మాట్లాడారు.

➡️