యుద్ధప్రాతిపదికన రైస్‌ మిల్లులకు ధాన్యం

ప్రజాశక్తి – ఏలూరు

జిల్లాలో రైతులు పండించిన ధాన్యం మొత్తం యుద్ధప్రాతిపదికన రైస్‌ మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. తుపాన్‌ అనంతరం చేపట్టాల్సిన చర్యలపై స్థానిక కలెక్టరేట్‌ నుండి జిల్లా అధికారులతో కలిసి మండల అధికారులు, ప్రత్యేక అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ జిల్లాలో తూపాన్‌ అనంతరం చేపట్టాల్సిన పనులు మరింత వేగవంతం చేయాలన్నారు. అధికారులు రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఆఫ్‌ లైన్‌లో దగ్గరలోని రైస్‌ మిల్లులకు 24 గంటల్లోగా తరలించాలన్నారు. గోనెసంచులకు కొరత లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని బయటకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని డ్వామా అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. పంట నష్టాలపై సాధ్యమైనంత త్వరలో నివేదిక సమర్పించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, డ్రెయిన్లలో పూడిక తీయించాలని, రోడ్లపై చెత్త నిల్వ లేకుండా చూడాలని సూచించారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందేలా చూడాలన్నారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రుల్లో పాము కాటు నివారణ మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించాలని, రహదారులు భవనాల శాఖాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జెసి బి.లావణ్యవేణి, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, రహదారులు, భవనాలు, ట్రాన్స్‌కో ఎస్‌ఇలు శ్రీనివాసరావు, కేదారేశ్వరరావు, సత్యనారాయణ, జాన్‌ మోషే, సాల్మన్‌రాజు పాల్గొన్నారు.

➡️